సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశా శాఖా స్వటతి ఝటితిః స్వైరమభితః !
కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యంత చపలం
ధృడం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో ॥ 20
శ్లోకం
ఈ శ్లోకం మీద ఎంత చర్చ చేసినా, సంపూర్ణ భావాన్ని చెప్పలేదేమో, అనే అనిపిస్తుంది. సంపూర్ణంగా వివరించాలంటే, ఎన్నో రకాల దృక్కోణాలలో నుంచి చూడాలి. అసలు నిత్యమైనదేది ? సత్యమైనదేది ? అని తెలుసుకోవాలి. నిత్యమైనదీ సత్యమైనదీ కేవలము ఆత్మ మాత్రమే ! పరమాత్మ మాత్రమే ! మనలోని 'నేను' ను గురించి చర్చ చెయ్యాలి, విచారించాలి. భౌతికమైనవన్నీ క్షణికాలే ! ఆ సత్యాన్నే వేద విజ్ఞానం బోధిస్తోంది, ఉపనిషత్తులు ఉద్బోధిస్తున్నాయి. ఈ ప్రపంచంలోకి వచ్చిన మనం, ముళ్ళకంచె మీద పడిన బట్టను ఎంత జాగ్రత్తగా తీసుకోవాలో, అంత జాగ్రత్తగా, తామరాకు మీది నీటి బిందువులలా ఈ ప్రపంచంలో వ్యవహరిస్తూ, మన జీవుడు పరమాత్మను చేరటానికి సాధన చేస్తూ, దుఃఖ రహిత, పునరావృత్తి రహిత శాశ్వతానంద ధామాన్ని చేరటానికి ప్రయత్నించాలి. అదే సాంబసదాశివ పాద సన్నిధి.
శ్రీహర్షుడనే కవి సౌందరానంద కావ్యంలో సుందరి, ఆనందుల అన్యోన్య ఆనందమయ జీవితాన్ని, వారిరువురి మనస్సులలో ఉన్న శృంగారభావావేశాన్ని అత్యంత మనో రంజకంగా వర్ణిస్తారు. సుందరి, ఆనందుడు - ఇద్దరూ అపురూప సౌందర్యవంతులు, అందమైన ఆదర్శవంతమైన దంపతులు, పరస్పరం ప్రేమించుకుంటున్నారు. ఆనందుడికి సుందరి శరీర సౌందర్యం, క్షణం కూడా ఆమెను విడిచి ఉండలేనట్లుగా చేస్తోంది. ఆమె శరీర లావణ్యం, అందమైన ఆ హరిణనేత్రి కన్నుల సోయగం, నునుపుగా అద్దాల్లా కాంతివంతమైన ఆమె చెక్కిళ్ళు, కోటి స్వర్గ సుఖాలనందించే ఆమె మధురాధరములు, పూతీగలలా పెనవేసే ఆమె బాహువులు - ఇలా ఆ వర్ణన సాగిపోతూ ఉంటుంది. వారిద్దరూ ఒక్క క్షణం కూడా విడిచి ఉండరు. ఆనందుని తాపత్రయమంతా, తన సుందరి సౌందర్యం వసి వాడకుండా చూడాలనే ప్రయత్నమే ! ప్రియుడు కనుక అనుక్షణం దాసునిలా ఆమెకు సేవ చేస్తుంటాడు. ఆమె మృదువైన పాదాలకు సుతారంగా లత్తుక అద్దుతాడు, ఆమె బొట్టు పెట్టుకోవటానికి అద్దం పట్టుకుంటాడు ... ఇలా అదో లోకం ! బాహ్య స్పృహ లేని దైహికానంద రసమయ లోకం !
ఈ ఆనందుడు గౌతమ బుద్ధునిగా ప్రఖ్యాతి గాంచిన సిద్ధార్ధుని తమ్ముడు. గౌతమ బుద్ధుడు ప్రాపంచిక సుఖాల అస్ధిరత్వాన్ని బోధిస్తున్నాడు, జీవితం యొక్క క్షణ భంగురత్వాన్ని విప్పి చెప్తున్నాడు. ప్రాపంచికమైన ఏ అందాలైనా, ఏ సుఖాలైనా, సర్వం క్షణికమ్, సర్వం దుఃఖం అని చెప్తున్నాడు. దుఃఖ రహితమైన శాశ్వతానందం కోసం ప్రయత్నించాలని ప్రబోధిస్తున్నాడు. ఆయన బోధనలు విని ఎందరో ఆయన శిష్యులయ్యారు, బౌద్ధమతం స్వీకరించారు, అనుయాయులుగా మారిపోయారు. కానీ ఎంతమంది వచ్చి ఒక్కసారి బుద్ధుని ప్రబోధాలను వినమని పిలిచినా వెళ్ళడు. ఒకసారి గౌతమ బుద్ధుడే ఆనందుని కలిసి సత్యం బోధించాలని ప్రయత్నం చేస్తుంటే, అతను తన భార్యను వదిలి ఉండలేక ఆమె వద్దకు వెళ్ళిపోవాలని విలవిలలాడిపోతాడు. గౌతమ బుద్ధుడు ఆమెలో ఏమి ఉందని ఆమె సన్నిధిని కోరుతున్నావని అడుగుతాడు. ఆనందుడు ఆమె సౌందర్యం తనను ఆనందపరుస్తోందంటాడు. గౌతమ బుద్ధుడు అది ఆనందం కాదు, మోహపరవశత్వము, ఆ మోహాన్నే వదలాలంటాడు. ఆనందుడు సృష్టిలో తన భార్య సౌందర్యాన్ని మించిన సౌందర్యం లేదు కనుక తనకామె సౌందర్యం కావాలంటాడు. గౌతమ బుద్ధుడు 'నీ భార్య సుందరి అందాన్ని మించిన కోటిరెట్ల సౌందర్యాన్ని, ఆమె సన్నిధిలో నువ్వు పొందుతున్న ఆనందాన్ని మించిన ఆనందాన్ని నీ అనుభవంలోకి తెస్తానం'టాడు. 'అది నిజమైతే, మరి నీ భార్యను వదిలేసి, నా శిష్యుడివయి, బౌద్ధ భిక్షువుగా దీక్ష స్వీకరించిస్తావా?' అని అడుగుతాడు. ఆనందుడు నా భార్య సౌందర్యాన్ని మించినటువంటి సౌందర్యాన్ని నువ్వు చూపించలేవు. నిజంగా చూపించ గలిగితే, తప్పక నువ్వు చెప్పినట్లుగా చేస్తాను, నీతోనే ఉంటానంటాడు.
గౌతమ బుద్ధుడు ఆనందునికి తన దివ్య శక్తితో, దేవతా స్త్రీలను - అప్సరసలను మించిన అలౌకిక దివ్య త్రిజగన్మోహన సౌందర్యాన్ని చూపిస్తాడు, యోగ శక్తితో అటువంటి అలౌకిక ఆనందానుభవాన్ని కేవలము తన హస్త స్పర్శతో కలిగిస్తాడు. ఆ ఆనంద రసాంబుధిలో మునిగి తేలిన ఆనందుడు బాహ్య స్మృతికి రాగానే సన్యసించి దీక్ష స్వీకరించి, బౌద్ధ భిక్షువవుతాడు, జన్మ చరితార్థం చేసుకుంటాడు.
ఇంద్రియాలు అందానికి ఆకర్షితమవుతుంటాయి. అందమంటే కేవలం కంటితో చూసే అంద మొక్కటే కాదు. పంచేన్ద్రియాలతో అనుభవించే ఆనందాలన్నీ, భౌతిక సుఖాలన్నీ అందాలే ! ఆ అందాలకు భ్రమసి అందులోనే మునిగి తేలుతూ జన్మ పరంపరలో చిక్కుకుని శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలా బైటికి రాలేక కొట్టుకుంటున్నారు.
పంచేన్ద్రియాల ఆకర్షణలో కూడా రెండు ఇంద్రియాలు అన్నింటి కంటే ఎక్కువ గా మనిషిని కట్టి పడేస్తాయి. ఆ రెండు - స్పర్శ సుఖము, రసనేంద్రియము.
వీటిలో కూడా రసనేంద్రియము జీవితాంతమూ వెంటాడుతూనే ఉంటుంది. బ్రతికున్నంత కాలం రసనేంద్రియం రుచులను కోరుకుంటూనే ఉంటుంది. జిహ్వ చాపల్యం తగ్గించు కోవటం చాలా కష్టం. ఇంక రెండవ బలవత్తర మైన ఇంద్రియం గురించి ఆలోచిస్తే, వార్ధక్యం వచ్చి, శరీర పటుత్వం తగ్గితే, స్పర్శ సుఖం - భౌతిక కామ వాంఛ సన్నగిల్లుతుంది, మనస్సు కోరుతున్నా, శరీరానికి శక్తి ఉండదు కనుక దాని యందలి ఆసక్తి నశిస్తుంది. కానీ మనస్సుకు వార్ధక్యం ఉండదు. మనస్సులో కోర్కెలు చిగురిస్తూ ఉంటాయి. జ్ఞానంతో వాటిని సమూలంగా .
నిర్మూలనం చెయ్యాలి.
ఆయా ఇంద్రియాల ద్వారా ఆ ఆనందాన్ని అనుభవించేది మనస్సు. ఈ మనస్సు ద్వారా ఆనందాన్ని పొందుతున్నది జీవుడు. ఈ జీవుడు అసలైన ఆనందాన్ని అనుభవించ గలిగితే, ఈ భౌతికానందాల జోలికే వెళ్ళడు.
భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే !
సంప్రాప్తే సన్నిహితే కాలే
న హి న హి రక్షతి డుకృఙ్ కరణే !!
నారీస్తన భర నాభీదేశం
దృష్ట్వా మా గా మోహావేశం !
మాయామయమిదమఖిలం హిత్వా
బ్రహ్మ పదం త్వం ప్రవిశ విదిత్వా !!
భజగోవింద శ్లోకాల సార విమర్శ చేస్తూ, ఈ శ్లోకంతో అనుసంధానించాలి.
అసలైన ఆనంద ఘనమును గ్రహించాలి.
మన మనస్సనే కోతిని మోహాటవిలో స్వేచ్ఛగా తిరగనియ్యకుండా, భక్తి అనే తాడుతో గట్టిగా కట్టేసి, పరమేశ్వరుడనే భిక్షువునకు అప్పగించేస్తే, ఇంక అది పరమేశ్వరుడు చెప్పినట్లు చేస్తుంది, ఆడమన్నట్లు ఆడుతుంది. పరమేశ్వరుని ఆజ్ఞానువర్తి అయి పరమ పదమును పొందుతుంది. మనస్సు అధీనంలో మనం ఉండకూడదు. మన అధీనంలో - మనము అంటే జీవుడు - శివుడే ! మన అధీనంలో, శివుని అధీనంలో మన మనస్సు ఉండాలి. అప్పుడు కలిగే ఆనందము అసలైన ఆనందము. అదే శివానందము, శివ సౌందర్యానందము, అదే శివానందలహరి !!
🙏🙏🙏🌹🌹
డా. విశాలాక్షి.

No comments:
Post a Comment