Search This Blog

Friday, September 7, 2018

శివానందలహరి శ్లోకం 8

ఓం నమశ్శివాయ
శివానందలహరి శ్లోకం 8

యథా బుద్ధిశ్శుక్తౌ రజతమితి కాచాశ్మని మణిః
జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలమ్ !
తథా దేవ భ్రాంత్యా భజతి భవదన్యం జడజనో
మహాదేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే || 8 ||
శ్లోకం
పదాన్వయము, అర్ధతాత్పర్యములు -

పశుపతే !, జడజనః, మహాదేవ + ఈశం, త్వాం, మనసి, న మత్వా, శుక్తౌ, రజతమ్, కాచాశ్మని, మణిః, పైష్టే, జలే, క్షీరమ్, మృగతృష్ణాసు, సలిలమ్, ఇతి, బుద్ధిః, యథా, భవతి, తథా, భవత్, అన్యమ్, దేవభ్రాన్త్యా, భజతి.

పశుపతే ! = హే పశుపతీ !
జడజనః = జడుడైన జనుడు, మందబుద్ధులైన జనులు
మహాదేవ+ఈశం = మహాదేవుడివైన, ఈశుడివైన, దేవతలకు శాసకుడివైన
త్వాం = నిన్ను
మనసి = మనస్సునందు
న మత్వా = భావించక,
శుక్తౌ = ముత్యపుచిప్ప యందు
రజతం = వెండి అనీ
కాచ+అశ్మని = గాజురాతి యందు
మణిః = మణి అనీ
పైష్టే = పిండి కలిపిన
జలే = నీటియందు
క్షీరం = పాలు అనీ
మృగతృష్ణాసు = ఎండమావులను
సలిలమ్ = నీరు అనీ
ఇతి = ఇటువంటి
బుద్ధిః = బుద్ధిని ( మిథ్యా బుద్ధి )
యథా = ఏ విధముగా
భవతి = కలుగుచున్నదో, కలిగి ఉన్నారో,
తథా = అదే విధముగా
భవత్ + అన్యం = నీ కంటే ఇతరులైన వారిని
దేవ = దేవతలు
భ్రాన్త్యా = అనే భ్రమతో
భజతి = సేవించుచున్నాడు, సేవించుచున్నారు.

పశువులైన సర్వజీవులను రక్షించే ఓ పశుపతీ ! దేవాధిదేవా ! మహాదేవా ! మంద బుద్ధులైన నరుల బుద్ధి సరిగ్గా పని చెయ్యదు కనుక ముత్యపు చిప్పను చూచి వెండియని, గాజుముక్కను మణియని, పిండి కలిపిన నీటిని పాలు అనీ, ఎండమావులను చూచి నీరు అనీ భ్రమ పడతారు.  అదేవిధముగా, మంద బుద్ధులైన జడమతులు, పరమాత్మవు, సర్వ శక్తిమంతుడవు, సర్వేప్సిత ప్రదాయకుడవు, మోక్షమునివ్వగల దేవదేవుడివైన నిన్ను తెలుసుకోలేక, స్వల్పమైన ఐహికాముష్మికమైన కామనలను తీర్చగల ఇతర దేవతలనే అధికులుగా భ్రమపడి ఆరాధిస్తూ ఉంటారు అని జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు చెప్తున్నారు.

జడమైన శరీరమే నేను అనే భ్రాంతి కలిగిన వారు జడమతులు. సర్వసాధారణంగా నేను అనగానే, మనము వ్యవహారం కోసం మనకు పెట్టబడిన పేరు కల మన ఈ దేహమే నేను అనుకుంటాము. మన ఇంద్రియాలే నేననీ, మనస్సే నేననీ, ప్రాణమే నేననీ, ఇవన్నీ కలిసి ఉన్న దేహమే నేను అనీ అనుకుంటాము. దీనినే దేహాత్మ భ్రాంతి అంటారు. దేహమే నేను అనే భ్రాంతి ! దీనినే చిత్జడగ్రంథి అన్నారు. అంటే చైతన్యాన్ని జడంతో ముడి పెట్టడం.  తాము సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ అనే సత్యమును తెలుసుకోలేక దేహ భ్రాంతికి లోనవుతున్నారు. 'నేను' అనటానికి ఏది ఆధారమో, దానిని భ్రమ వల్ల గుర్తించలేక పోతున్నారు. ఒకదానిని మరొకటిగా భావిస్తున్నారు. ఈ భ్రమ ఎందు వల్ల అంటే, అజ్ఞానం వలన, మాయ వలన ! మాయ అంటేనే మోహము, భ్రమ. మాయకు రెండు శక్తులున్నాయి. 1.ఆవరణ శక్తి. 2. విక్షేప శక్తి. ఆవరణము అంటే కప్పి పెట్టటము. ఆవరణ శక్తి ఉన్న సత్యాన్ని కనపడనీయకుండా కప్పేస్తుంది. విక్షేప శక్తి ఉన్నదాన్ని వేరే దానిలా కనిపించేలా చేస్తుంది. దీనినే రజ్జు సర్ప భ్రాంతి అనీ, శుక్తి రజత భ్రాంతి అనీ అనేక ఇతర ఉపమానాలతో చెప్తారు. ఉన్న పరబ్రహ్మ కనిపించదు. లేని విశ్వం గోచరిస్తూ ఉంటుంది. అనుభవంలో భాసిస్తూ, మోహపెడుతూ ఉంటుంది.

ఈ శ్లోకంలో ఆచార్యులు భ్రాంతి ఎలా ఉంటుందో ఉదాహరణలతో చూపించారు.
తళతళ లాడుతున్న ముత్యపు చిప్పలను చూసి వెండి అనుకోవటము,
గాజు రాళ్ళను మణి అనుకోవటము,
పిండి కలిపిన నీటిని పాలను కోవటము భ్రాంతి వల్ల, వస్తు యథార్ధ జ్ఞానము లేకపోవటం వల్ల కలిగేవి. ఈ ఉదాహరణలలో ఒక దానిపైన వేరే దానిని ఆరోపించటము జరిగింది. ముత్యపు చిప్ప మీద వెండి ఆరోపించ బడింది. అలాగే, గాజురాయి మీద రత్నము, తెల్లగా కనిపించే పిండి నీళ్ళ మీద పాలు ఆరోపించ బడ్డాయి. ఆ వస్తువులలో ఆరోపించ బడిన వస్తు లక్షణములు గోచరిస్తున్నాయి కనుక అలా ఆరోపించబడటానికి అవకాశం కుదిరింది. దీనిని అధ్యారోపము అంటాము.
అసలు నీరులేని చోట నీరుందను కోవటాన్ని  ఎండమావులు అంటాము. ఎండమావులను, గంధర్వనగరాన్ని, వంధ్యాపుత్రుని, కుందేటి కొమ్మును కూడా లేనిది ఉన్నదనుకోవటానికి ఉదాహరణలుగా చెప్తారు.
అలాగే అజ్ఞానం వలన
దేవాధిదేవుడవు, పరబ్రహ్మమునగు
నిన్ను మనస్సునందు భావన చేయక, నీకు భిన్నమైన ఇతర సామాన్య దైవములను భజించుచున్నారు మూఢమతులు అని జగద్గురువులు తెలియజేస్తున్నారు.

దేహమే నేను అనుకునే వారిని జడజనులు అంటున్నారు ఆచార్యులు!
మనిషిని చిత్ జడగ్రంధి అని అంటుంది ఉపనిషత్తు!
జడమే నేననుకునే వారు జడజనులు. చిచ్ఛక్తే పరమాత్మ. సర్వ జీవులలో ఉన్న చైతన్యమే పరమాత్మ. ఆయనే మహేశ్వరుడు, మహాదేవుడు.

తాను కాని దానిని తాననుకుని, నీవు కాని వాటిని నీవనుకొని భ్రమలో బతుకుతున్న జడజనులను వారు పశువులు కనుక, వారి రక్షణ భారం నీది కనుక, నీవే ఈశ్వరుడివి, సర్వశాసకుడివి కనుక పరమేశ్వరా ! నీవే కరుణించి,
వారిని మాయనుండి  రక్షించు ! నిన్ను గురించిన జ్ఞానాన్ని వారికి కలుగజెయ్యి. శాశ్వతానంద ప్రాప్తిని, శ్రేయస్సును అనుగ్రహించు అని ప్రార్ధిస్తున్నారు జగద్గురువులు ఈ శ్లోకంలో ! ప్రతి శ్లోకంలోను ఆ శ్లోకములో చేయబడిన ప్రార్ధనకు అనుగుణమైన సంబోధనతో మహేశ్వరుడిని ప్రార్ధిస్తున్నారు ఈ శివానంద లహరి శ్లోకాలలో !

దేవతలు అంటేనే తేజోమయ శరీరులు, మానవుల కంటే గొప్పవారు. వారికి నాయకుడు మహేంద్రుడు. మహేంద్రుని కంటే అధికులు త్రిమూర్తులు. వారి కంటే అధికుడు పరమాత్మ, పరబ్రహ్మ, ఉపనిషత్ప్రతిపాదిత సత్యమైన మహాదేవుడు. అటువంటి ముక్తినిచ్చే మహేశ్వరుని స్మరించకుండా, స్వల్పమైన కోరికలను తీర్చే దైవాలను కొలవటం ప్రచండ తేజంతో వెలుగొందుచున్న భాస్కరుడుండగా, వెలుగు కోసం గుడ్డి దీపాలను, బుడ్డి, లాంతర్లలాంటి దీపాలను ఆశ్రయించటం లాంటిది అని తెలుసుకోవాలి.

🙏🙏🙏🌹

డా.విశాలాక్షి.

No comments:

Post a Comment