Search This Blog

Friday, September 7, 2018

శివానందలహరి శ్లోకం 9

🙏🙏🙏🙏
ఓం నమశ్శివాయ
శివానందలహరి శ్లోకం 9

గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః !
సమర్ప్యైకం చేతస్సరసిజముమానాథ భవ తే
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో !! 9 !!
శ్లోకం
పదాన్వయం, అర్ధతాత్పర్యములు -

ఉమానాథ, భవ, జడమతిః, జనః, కుసుమార్ధం, గభీరే, కాసారే, విశతి, విజనే, ఘోర విపినే, చ, విశాలే, శైలే, భ్రమతి, ఏకః, చేతః + సరసిజం, తే, సమర్ప్య, ఇహ, సుఖేన, అవస్థాతుం, కిం, న జానాతి, అహో !

ఉమానాథ = హే ఉమాదేవి భర్త అయిన సాంబశివా !
భవ = హే భవా ! నిత్యము ఉండునటువంటి స్వామీ !
జడమతిః = మందమతి అయిన
జనః = మానవుడు
కుసుమార్ధం = (నిన్ను పూజించటానికి) పువ్వుల కోసం
గభీరే = లోతైన
కాసారే = తటాకములందు
విశతి = ప్రవేశిస్తున్నాడు
విజనే = మనుష్యులు లేనటువంటి
ఘోరవిపినే = భయంకరమైన అరణ్యములందు
చ = మరియు
విశాలే = విశాలమైన
శైలే = పర్వతముల మీద
భ్రమతి = తిరుగుతున్నాడు.
ఏకం = ఒక్క
చేతః + సరసిజం = మనస్సు అనే పద్మమును
తే = నీకు - నీ కొరకు,
తే బదులు భవతే = నీకు, నీ కొరకు - అని కూడ అన్వయించ వచ్చును.
సమర్ప్య = సమర్పించి
ఇహ = ఇక్కడే, ఈ లోకంలోనే
సుఖేన = సుఖముగా, సంతోషముతో
అవస్ధాతుం = ఉండటానికి, ఉండగలమని
కిం = ఎందుకు
న జానాతి  = తెలుసుకోవటం లేదో !
అహో = ఎంత ఆశ్చర్యము !!

హే ఉమానాథ !
జడుడైన మానవుడు తెలివి లేనివాడై, సులభమైన ఉపాయం తెలియనివాడై, నిన్ను పూజించటానికి పుష్పముల కొరకు లోతైన చెరువులందు దిగుచున్నాడు, నిర్జనమైన భయంకర అరణ్యములందు, విస్తీర్ణమైన పర్వతము లందు తిరుగుచున్నాడు. కానీ  మనస్సనెడి పద్మము ఒక్కటి నీ పాద పద్మముల యందు సమర్పించిన చాలు సుఖముగా ఉండవచ్చును అన్న విషయాన్ని తెలుసుకో లేకుండా ఉన్నాడే ! ఎంత ఆశ్చర్యంగా ఉన్నది !!

ఈ శ్లోకంలో ఆచార్యులు ఉమానాథా ! అని, భవ ! అని సంబోధిస్తున్నారు. ఎందుకంటే, బ్రహ్మ విద్యా స్వరూపిణి ఉమాదేవి, బ్రహ్మజ్ఞానమే మహేశ్వరుడు. ఈ శ్లోకంలో బ్రహ్మవిద్యను -  బ్రహ్మానందమును పొందే మార్గాన్ని తెలియజేస్తున్నారు కనుక ఉమాపతే, అనే నామంతో సంబోధించారు.
ప్రణవములోని 'అ ఉ మ' లే ఉమలో ఉన్నాయి. ఈ బీజాక్షరాలకు వర్ణవిద్య అని పేరు. 'భవుడు' అంటే, ఉన్నవాడు. నిత్యుడు. తననుపాశించే వారిని నిత్యులనుగా చెయ్యగలవాడు.

"అహింసా ప్రధమం పుష్పం
పుష్పమింద్రియ నిగ్రహం !
సర్వభూతదయా పుష్పం
క్షమా పుష్పం విశేషతః !!
శాంతి పుష్పం తపః పుష్పం
ధ్యాన పుష్పం తథైవ చ !
సత్యమష్టవిధం పుష్పం
శంభోః ప్రీతికరం భవేత్" !!

ఈ శ్లొకంలో శ్రీ మహాదేవునకు అత్యంత ప్రీతి పాత్రమైన ఎనిమిది పుష్పముల గురించి చెప్పబడింది. 

వీటిలో అహింస - మనోవాక్కర్మలతో ఎవరినీ బాధించకుండా ఉండటం మొదటి పుష్పము.
రెండవది ఇంద్రియ నిగ్రహము. కోట్ల కోట్ల జన్మ పరంపరకు కారణ భూతమైన ఇంద్రియ లోలత్వాన్ని నిగ్రహించి, నిర్మూలించ గలగటం.
మూడవది    సర్వభూతముల యందు దయ కలిగి ఉండుట. ఇదే అనుకంప. ఇదే సమత్వము.
నాలుగవది క్షమ, తితిక్ష.
ఐదవది శాంతము. నవ రసముల పరాకాష్ట శాంతమే !
ఆరవది తపస్సు. ఏకాగ్రతే తపస్సు.
ఏడవది ధ్యానము, ధ్యానము వల్లే పరమాత్మ దర్శనము సాధ్యము.
ఎనిమిదవది సత్యము.

ఇవీ మనము భగవంతునికి సమర్పింప వలసిన
పుష్పములు.
ఈ సుగుణములను మనం అలవరించుకొని ఆ భగవంతునికి మనం ప్రీతిపాత్రులమవాలి. 

బాహ్యం లో మనం భగవంతునికి పూజ చెయ్యాలి. పుష్పములు సమర్పించాలి.
బాహ్యంలో మనం చేసే పూజతో, మన ప్రవర్తనతో మన మనస్సులో, మన హృదయంలో ఈ ఎనిమిది పుష్పములు వికసించాలి. వాటిని మనం ఆయనకు సమర్పించాలి.

'తోమని పళ్ళాలవాడిని పూయని పుష్పాలతో పూజించాలి అనటం విన్నాము.
భగవంతుని కొందరు బంగారు పూలతో పూజ చెయ్యవచ్చు, కొందరు వెండి పూలతో పూజించవచ్చు, కొందరు మట్టిపూలతో పూజించవచ్చు.  అయితే అన్ని పూలలోకి భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పూవులు - అహింసా ప్రధమం పుష్పం. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పం అహింస. మరో పుష్పం సర్వ భూత దయ. అలాగే మిగతా పుష్పాలు శాంతి, క్షమ, తపస్సు మొదలైనవి.
క్షమా పుష్పం అన్నింటికన్నా విశేషమయినది. ఈ పూవులు ఏ చెట్టుకీ పూయవు, ఎంత ధనమిచ్చినా కొనలేము. కేవలం పూర్వజన్మ సంస్కారం వలన, మన నడవడి బట్టే ఈ పుష్పాలను సంపాదించవచ్చును.

ధర్మము, సత్యం, దానం, సహనం, ధ్యానం, తపస్సు, శాంతి, క్షమ లాంటి దైవ గుణాలు మన మలవరచుకోవటం వలన, ఈ గుణాలనే భగవంతునికి పూజా పుష్పాలుగా సమర్పించటం వలన మనం భగవంతుని అనుగ్రహాన్ని తప్పక పొందగలము. భగవంతుని మీద నమ్మకం లేనివాళ్ళు కూడా ఈ గుణాలను అలవరచుకోవటం వలన సామాజికంగా ఎంతో ప్రశాంతత నెలకొంటుంది, శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తాయి.

తొండమాన్ చక్రవర్తి తాను పరమ భక్తుడననీ, సాక్షాత్తుగా శ్రీనివాసుడే తనతో మాట్లాడుతున్నాడని కించిత్ గర్వభావం పొందాడట. వెంటనే శ్రీవేంకటేశ్వర స్వామి అతని అహంకారాన్ని పోగొట్ట దలిచాడు. మర్నాడు తొండమాన్ చక్రవర్తి స్వామిని పూజించటానికి వచ్చేప్పటికి అతను పూజించిన బంగారుపూల మీద బంకమట్టితో చేసిన పూలు కనిపించాయి. అతను ఆశ్చర్యపోయాడు, బాధ పడ్డాడు. నాకంటే మించిన భక్తులు నీకున్నారా ? అని శ్రీవేంకటేశ్వర స్వామిని అడిగాడు. తన పరమ భక్తుడు భీముడు అనే కుమ్మరివాడు అని చెప్పాడు పరమాత్మ. అతను ప్రతి రోజు పని ప్రారంభించే ముందు బంకమట్టితో పూలు చేసి, తన ఇంట్లో గూట్లో పెట్టుకున్న చెక్కతో చేయబడిన వేంకటేశ్వరస్వామిని ఆ మట్టిపూలతో పూజిస్తున్నాడు. భక్తితో సమర్పించే దేనినైనా స్వామి స్వీకరిస్తాడు. అహంకారంతో వజ్రవైఢూర్యాలిచ్చినా వద్దుపొమ్మంటాడు.

నిజానికి పూజలో పుష్పము ఒక ప్రతీక మాత్రమే ! ముని వేళ్ళతో పూవును పట్టుకుని మన హృదయానికి తాకించి భగవంతునికి సమర్పించాలి. అంటే అర్ధం తాను సమర్పించేది బాహ్యంలో దొరికే కుసుమాలు మాత్రమే కాదు, హృదయ పుష్పాలను సమర్పిస్తున్నానని చెప్పటమే ! 'త్వదీయం వస్తు పరమేశ తుభ్యమేవ దదామ్యహం'. 'మనోపుష్పం సమర్పయేత్'. అన్నారు. మనో పుష్పం సమర్పించటమంటే, ఇంద్రియాలను, మనస్సును, హృదయాన్ని సమర్పించటమే !

'మనో నాశో మహోదయః'
'మనో లయమే మోక్షము'.
మానసిక పూజ
మనో పుష్పాన్ని సమర్పించే స్థితి వచ్చే వరకూ బాహ్య పూజ చేస్తూనే ఉండాలి.
పరమాత్మను చతుష్షష్ట్యుపచారాలతో పూజించాలి.  కుదరకపోతే,  షోడశోపచారాలతో  పూజించాలి.
షోడశోపచారాలలో సహజమైన సుగంధము, సౌకుమార్యము కలిగిన  పుష్పానికి ప్రత్యేకత ఉన్నది. పూజలో ముందు పుష్పాలు సమర్పించినా, పూజ చివరిలో ఆ పుష్పాన్ని మంత్రపూతం చేసి 'మంత్ర పుష్పం ' సమర్పిస్తాము. షోడశోపచారాలతో కూడా పూజించలేనివారు
కనీసం మనకు  పంచేంద్రియాలను  ఇచ్చినందుకు  కృతజ్ఞతగా  పంచోపచారాలతో నైనా  పూజించి, మనస్సు  అనే మంత్ర పుష్పాన్ని  సమర్పించాలి.
మనలోని ఇంద్రియాలను,  మనస్సును మంత్రంతో  అనుసంధానం చేసి, మాలిన్యాలు తొలగి మంత్రపూతమైన మనస్సును సమర్పించటమే  మంత్రపుష్ప సమర్పణ.
ఎంతో కష్టపడటం కంటే, సులభమైన ఉపాయంతో పరమాత్మ అనుగ్రహం పొందవచ్చును. ఒకప్పుడు గణాధిపత్యం ఎవరికివ్వాలి ? అనే మీమాంస కలిగినప్పుడు వినాయకుడు, కుమారస్వాములలో ఎవరు ముందు త్రిలోక ప్రదక్షిణ చేసి వస్తే, వారికే గణాధిపత్యం ఇస్తానని సాంబసదాశివుడు  చెప్తాడు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనం మీద త్రిలోక సంచారానికి బయలు దేరాడు. తెలివి, బుద్ధి సూక్ష్మత కలిగిన వినాయకుడు తల్లితండ్రులకు ముమ్మారు ప్రదక్షిణ చేసి, వారి పాదాలు కడిగి, నీరు తల మీద చల్లుకున్నాడు. త్రిలోక ప్రదక్షిణ చేసిన ఫలం దక్కించుకున్నాడు. కనుక భక్తి, శ్రద్ధలతో సులభంగా పరమేశ్వరుని అనుగ్రహం పొందవచ్చును.

సత్యం మాతా పితా జ్ఞానం
ధర్మో భ్రాతా దయా సఖా !
శాంతిః పత్నీ క్షమా పుత్రః
షడేతే మమ బాంధవాః !!

🙏🙏🙏🌹

డా.విశాలాక్షి.

1 comment:

  1. ఓం నమఃశివాయ.నమస్తే మాతాజీ.విశ్లేషణ ,వివరణ చాలచక్కగా వున్నది.ఓం నమః శివాయ.

    ReplyDelete