Search This Blog

Friday, September 7, 2018

శివానందలహరి శ్లోకం 6

ఓం నమశ్శివాయ
శివానందలహరి
శ్లోకం 6

ఘటో వా మృత్పిండోప్యణురపి చ ధూమోగ్నిరచలః
పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్ !
వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః  !! 6 !!
శ్లోకం
పదాన్వయము, అర్ధతాత్పర్యములు -

సుధీః, ఘటః, వా, మృత్పిండః, అపి, చ, ధూమః, అగ్నిః, అచలః,  పటః, వా, తంతుః, వా, ఘోరశమనమ్, పరిహరతి కిం, వృధా, కంఠక్షోభః, వహసి, తరసా, తర్క వచసా, శంభోః, పదాంభోజమ్, భజ, పరమ సౌఖ్యం, వ్రజ.

సుధీః = ఓ మంచి బుధ్ధి కలవాడా !
ఘటః = కుండ కానీ,
వా = లేదా
మృత్ పిండః అపి =  మట్టి ముద్ద అయినా,
అణుః అపి = లేక (కేవలము) పరమాణువులు అయినా
చ = మరియు
ధూమః = పొగ కానీ
అగ్నిః = అగ్ని కానీ
అచలః = పర్వతము కానీ,
(అగ్ని కనిపించుచున్నది కావున, బహుశా పర్వతముపై నిప్పు ఉండవలెను (మొ.న హేతువాదములూ)
పటః = వస్త్రము కానీ,
వా = లేక
తన్తుః వా = లేక దారములా (ఇత్యాది తర్కములు)
ఘోరశమనం = ఘోరమగు మృత్యువును (యముడిని)
పరిహరతి కిం ? = తొలగించ గలవా?
తరసా తర్కవచసా = తీవ్రమైన తర్క వాదములతో
వృథా = వ్యర్ధముగా
కంఠ క్షోభం = కంఠశోషను
వహసి = పొందుచున్నావు.
శంభోః = శంభుని యొక్క
పదాంభోజం = పాద పద్మములను
భజ = భజింపుము,
పరమసౌఖ్యం = (తద్వారా) పరమ సౌఖ్యములను
వ్రజ = పొందుము.

కుండగానీ, మట్టి ముద్దగానీ , పరమాణువు గానీ, పొగగానీ, నిప్పుగానీ, పర్వతముగానీ , వస్త్రము గానీ , దారము గానీ ఇవేమీ భయంకరమయిన మృత్యువు నుండీ కాపాడలేవు. అందుకే ఓ మంచిబుద్ధి కలవాడా ! పైన చెప్పిన తర్కశాస్త్రమునందలి మాటలతో వృథాగా కంఠక్షోభ కలిగించు కొనక, శంభుని యొక్క పాదపద్మములను సేవించి, శీఘ్రముగా శివ సాయుజ్యమును పొందుము.
తర్కాది శాస్త పరిజ్ఞానము చిత్తశుధ్ధికీ, ఆత్మజ్ఞానమునకూ దోహదపడాలి. అంతే కాని కేవల శాస్త్రపరిజ్ఞానము వ్యర్థమని శంకరాచార్యుల ఉపదేశం.

సాంఖ్యులు, నయ్యాయికులు, వైశేషికులు మొదలగు వారు చేసే శాస్త్ర చర్చల వల్ల జీవిత పరమ ప్రయోజనం సిద్ధించదని జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు. "కనబడుచున్న ఆ వస్తువు కుండయా? లేక మట్టియా? లేక అణువులా?" వంటి హేతువాదములు, "దూరముగా ఆ కొండపై పొగ కనిపించున్నది కాబట్టి అక్కడ నిప్పు ఉండి తీరవలెను" వంటి తర్క వాదములు, "దీనిని వస్త్రముగా చూడవలెనా? లేక దారముల సమూహముగా చూడవలెనా?" వంటి శుష్క వాదములను తీవ్ర స్థాయిలో చేయుట వలన కేవలము వ్యర్ధముగా కంఠశోష తప్ప ఎంతమాత్రము ప్రయోజనము లేదు. అట్టి అనవసర వాదములు మనలను ఘోరమగు మరణము నుండి ఏమైనా రక్షించగలవా? అందువల్ల, ఓ బుధ్ధిమంతుడా ! వాటి బదులు పరమశివుని పాద పద్మములను పూజించుచూ పరమ సౌఖ్యములను పొందుము అని చెప్తున్నారు.

ధూర్జటి తన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యములో

"ఏ వేదంబు పఠించె లూత? భుజగం బే శాస్త్రముల్సూచెఁ దా
నే విద్యాభ్యసనం బొనర్చెఁగరి, చెంచే మంత్ర మూహించె ? బో
ధావిర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు, నీ పాదసం
సేవాసక్తియె కాక జంతు తతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా"! అన్నారు.

ప్రాణికోటికి మోక్షము కలుగుటకు నీ పాదాలు సేవించు భక్తి ఒక్కటే కారణం గానీ, చదువులెన్ని చదివినా, అనుభవ జ్ఞానమును, మోక్షమును కలిగిస్తాయా ?

నీ దయతో మోక్షము పొందిన సాలెపురుగు ఏ వేదము చదివింది? పాము ఏ శాస్త్రములు పఠించినది? ఏనుగు ఏ విద్యలు నేర్చుకున్నది? ఎరుకలవాడు ఏ మంత్రజపము చేశాడు. వీరందరూ ముక్తి పొందటానికి చదువులే కారణమైనవా? కాదు కదా ! కేవలము భక్తి చేత ఈశ్వరానుగ్రహం పొంది తరించారు వీరందరూ.

అందుకే శంకరాచార్యులు 'భజ గోవిందం భజ గోవిందం
భజ గోవిందం మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృంకరుణే' అని ఉద్బోధ చేశారు.

భజ గోవిందం భజ గోవిందం అని గోవిందుణ్ని భజించు మూఢమతీ ! జీవితమంతా వల్లె వేసిన ఈ డుకృంకరుణే అనే వ్యాకరణ సూత్రాలు నిన్ను అవసాన కాలంలో రక్షించవు అని చెప్పారు.

లౌకిక విద్యలు ప్రపంచంలో అందరికీ అవసరమే. ఈ విద్యల వలన మనలో విజ్ఞానం, వినయం, లోకజ్ఞానం, కలుగుతాయి. అయితే ఈ విద్యలు ప్రపంచంలో జీవించటానికే తప్ప, జీవిత పరమ గమ్యాన్ని చేరటానికి ఉపయోగప డవు. మృత్యువును ఈ విద్యలు తప్పించలేవు. ఉదర పోషణే ప్రధానం అని జీవించే మానవుడు ఎన్నటికీ పరమపదాన్ని చేరు కోలేడు. అజ్ఞానమనే మాయపొర జ్ఞానమనే వెలుగును కప్పి ఉంచుతుంది. ఆ మాయను తొలగిస్తేనే గాని జ్ఞానము యొక్క అసలు తేజం తెలియదు. మనలో ఉన్న మాయను తొలగించడం అంత తేలికైన పనికాదు. దానికి ఆధ్యాత్మిక పరమైన విద్య చాలా అవసరం. ' అధ్యాత్మ విద్యా విద్యానాం' అంటోంది శ్రుతి. వేదోపనిషత్తులలో ఉన్న విషయాలు, అష్టాదశ పురాణాలలో ఉన్న విషయాలు లోతుగా అధ్యయనం చేయాలి. ప్రతి ఒక్కరికి భక్తి ఉండాలి. ఆ భక్తి వలన అధ్యాత్మపరమైన జ్ఞాన సంపద వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక చింతలో ఉన్న వారికి ఏదో ఒక సమయంలో వైరాగ్యం కలుగు తుంది. అంతిమ దశలో మనల్ని రక్షించేది ఆధ్యాత్మిక భావనలే. ఈ సంసార సాగరం నుంచి తరింపజేసేది కేవలం భగవన్నామ స్మరణమే. అందుకే ప్రాణం పోయే ముందు మనిషికి చెవిలో ‘నారాయణ, నారాయణ’ అనే నామాన్ని వినిపిస్తారు. ఈ నగ్న సత్యం తెలిసి కూడా హరి నామాన్ని కీర్తించనివారు మూఢాత్ములే ! ప్రతి ఒక్కరూ, ప్రతి క్షణం భగవన్నామ స్మరణతో నిండు జీవితాన్ని పునీతం చేసుకోవాలి.

🙏🙏🙏🌹🌹
డా.టి.(ఎస్)విశాలాక్షి

No comments:

Post a Comment