Search This Blog

Friday, September 7, 2018

శివానందలహరి. శ్లోకం - 5

ఓం నమశ్శివాయ
శివానందలహరి.
శ్లోకం - 5

స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ
పురాణే మంత్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః !
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కో2హం పశుపతే !
పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో !!
శ్లోకం
పదాన్వయమ, అర్ధములు, భావము, వివరణ -

పశుపతే, సర్వజ్ఞ, విభో, స్మృతౌ, శాస్త్రే, వైద్యే, శకునకవితాగానఫణితౌ, వా, మన్త్రే, స్తుతి, నటన, హాస్యేషు, అచతురః, మయి, రాజ్ఞాం, ప్రీతిః, కథం, భవతి?, అహం కః, ప్రథిత కృపయా, మాం, పాలయ.

పశుపతే = ఓ పశుపతీ ! సర్వ జీవులకు ప్రభువైనవాడా !
సర్వజ్ఞ = సర్వం జానాతి ఇతి సర్వజ్ఞః, సర్వము తెలిసినటువంటివాడా !
విభో = హే ప్రభూ !
స్మృతౌ = స్మ్రుతులయందు (పరాశర స్మృతి, మనుస్మ్రుతి మొ.గు)
శాస్త్రే = శాస్త్రములయందు
వైద్యే = వైద్యమునందు
శకున = శకున శాస్త్రము నందు
కవితా = కవిత్వము నందు
గాన = సంగీతము నందు
ఫణితౌ = సభలో వాగ్వాదములు చేసే శక్తి యందు కానీ
పురాణే = పురాణములయందు
వా = లేక
మన్త్రే = (వేద) మంత్రములయందు
స్తుతి = స్తుతించుటయందు
నటన = నటనయందు
హాస్యేషు =  హాస్యమునందు
అచతురః = చతురత, నిపుణత లేనివాడను. మయి = నాయందు
కథం = ఏవిధముగా
రాజ్ఞాం ప్రీతిః = రాజుల యొక్క ఆదరము
భవతి = కలుగుతుంది ?
కః అహం = నేను ఎవరు?
పశుం మాం = కేవలము అవివేకియైన పశువునైన నన్ను
ప్రథిత = వేదములలో కీర్తించబడి, ప్రసిద్ధుడివైన ఈశ్వరా ! నీ ప్రసిద్ధి గాంచిన
కృపయా = కృపతో
(నన్ను)
పాలయ = పాలించుము.

నేను స్మృతులయందు, శాస్త్రములయందు, వైద్యమునందు, శకున శాస్త్రమునందు, కవిత్వ, సంగీత, వ్యాకరణములయందు, పురాణములయందు, వేద మంత్రములయందు, స్తుతి చేయుటయందు, నటన హాస్యాదులలో ఎందులోనూ కూడా ఎటువంటి చాతుర్యము లేనివాడను. అట్టి నాయందు ప్రభువులైన రాజులకు ఆదరము ఏవిధముగా కలుగుతుంది? ఓ పశుపతీ, అసలు నేను ఎవరిని వారి ప్రేమను పొందటానికి ? నేను కేవలము అవివేకినైన పశువును. అయినప్పటికీ, ఓ సర్వజ్ఞమూర్తీ, నీ అపారమగు కృపతో నన్ను రక్షించుము.

సర్వజ్ఞుడవైన హే ఈశ్వరా ! శ్రుతి, స్మృతి,  పురాణేతిహాసముల చేత తెలియబడే ప్రభో !
మను స్మృతి, పరాశర స్మృతి, నారద స్మృతులవంటి
స్మృతులయందు గానీ, తర్క, వ్యాకరణ, మీమాంసాది శాస్త్రములయందు గానీ, ధర్మశాస్త్రములందు గానీ, ఆయుర్వేదము వంటి వైద్యమునందు గానీ, శకునములు చెప్పుటయందు గానీ, కవిత్వము చెప్పి మెప్పించుటయందు గానీ, సంగీతము పాడి రంజింపజేయుట యందు గానీ, పురాణ ప్రవచనములు చెప్పుట యందు గానీ,  మంత్రశాస్త్ర మందు గానీ, ఎవరిని గురించి స్తోత్రములు చేయుట యందు గానీ, నాట్యము చేయుటయందు గానీ, హాస్యోక్తులు చెప్పి నవ్వించుట యందు గానీ ఏమాత్రమూ నేర్పు లేనివాడను. ఇట్టి నాయందు రాజులకు ప్రేమ ఎందుకు కలుగుతుంది ? ఒకవేళ వారికి నా యందు ప్రీతి కలిగి ఆదరించినా, వారిని సంతోష పెట్టడానికి నేనెవరిని ? నాకు వారిచ్చేటటువంటి అధికారములు కానీ, బహుమతులు మొదలగు ఫలములు ఏవీ వద్దు. హే పశుపతే ! నే నెవ్వరినో నాకే తెలియని అజ్ఞానిని, పశువును అయిన నన్ను పశుపతివైన నీవు అత్యంత దయతో రక్షించుము అంటూ జగద్గురువులు ఈశ్వరుని ప్రార్థిస్తున్నారు. శ్రీ ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్తుగా ఈశ్వరుడే అయి ఉండీ, తాము సర్వజ్ఞులై ఉండి కూడా మానవ దేహంతో భూమి మీద సంచరిస్తున్నందు వలన మానవులెప్పుడూ అల్పజ్ఞులే, పరమాత్మే సర్వజ్ఞుడని చెప్పటానికీ, భగవంతునికి అహంకారం కలవారంటే వచ్చదు, దీనులంటే ప్రియము కనుక ఈ శ్లోకంలో తనకేమీ తెలీదని దీనత్వాన్ని తెలియజేస్తున్నారు. నారద భక్తి సూత్రాలలో ' ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్, దైన్య ప్రియత్వాత్ ' అని ఉంది.
జగద్గురువులు తమ 'దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం' లో -
"న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతి మహో
న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథాః !
న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం
పరం జానే మాతః త్వదనుసరణం క్లేశ హరణమ్ !! అని శలవిచ్చారు.
పరమాత్మ పశువులను పాలించేవాడు పశుపాలకుడు. నేను పశువును, నీవు పశుపతివి. కనుక నన్ను కాపాడటం నీ బాధ్యత అని చెప్తున్నారు ఈ శ్లోకంలో ! జీవులందరూ పశువులే ! కాలపాశ బద్ధులైన వారందరూ పశువులే ! అజ్ఞానముతో, అవిద్యతో బంధించబడిన వారందరూ పశువులే ! కాలాతీతుడైన, ఏ పాశము చేత బంధింపబడని పరమాత్మే పశుపతి.

జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు అత్యంత కరుణామయులు. కనుకే మనవంటి వారికి భగవత్ప్రార్ధన ఎలా చెయ్యాలో ఈ శ్లోకం ద్వారా తెలియపరిచారు.

ఈ శ్లోకంలో 'కథం మయి రాజ్ఞాం ప్రీతిర్భవతి ?  కో2హం ?' అని రెండు ప్రశ్నలు వేశారు. రాజుకి, అధికారులకు నా మీద ప్రీతి ఎలా కలుగుతుంది ? అసలు నేనెవరిని ? అని !!
మనం మనకేం కావాలన్నా, మనకంటే గొప్ప వాళ్ళను ఆశ్రయిస్తాము. వాళ్ళు వాళ్ళ కోర్కెలు తీర్చుకోవటానికి వాళ్ళ కంటే గొప్ప వారినాశ్రయిస్తారు. అది ఒక గొలుసులాంటిది. స్వల్పమైన చిన్న చిన్న కోర్కెలను తీర్చగలిగే, మన కంటే గొప్పవారైన అల్పశక్తిమంతుల్ని ఆశ్రయించటం కంటే, సర్వ శక్తిమంతుడైన పరమేశ్వరుడినే ఆశ్రయిస్తే, ఇంక లోటే ఉండదు కదా !
ధూర్జటి మహాకవి తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో రాజులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండరు. ఇష్టం వస్తే అందలమెక్కిస్తారు, కోపం వస్తే, శిక్షిస్తారు. వారి సంపదలు క్షణికాలు. అలాంటి వారిని ఆశ్రయించరాదని నిర్ణయించి చెప్పారు.

" రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చునం
భోజాక్షీ చతురంత యాన తురగీ భూషాదులాత్మవ్యథా
బీజంబుల్, తదపేక్ష చాలు, బరితృప్తిం బొందితిన్, జ్ఞానల
క్ష్మీ జాగ్రత్ప రిణామమిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా" !!

శిక్షా, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, మరియు కల్పము అనే ఆరు వేదాంగాలు, న్యాయ వైశేషిక, సాంఖ్య యోగ, మీమాంస వేదాంతమనే షడ్దర్శనాలు, ఇవి గాక ధర్మశాస్త్రాలు, అన్ని కూడా శాస్త్రాలే ! ఇంకా అష్టాదశ పురాణాలున్నాయి. అనేక మంత్ర తంత్ర శాస్త్ర గ్రంథాలున్నాయి. ఇటువంటి వేటిలోనూ తనకు నైపుణ్యం లేదని ఆచార్యులు చెప్తున్నారంటే, అది జీవుడైన తాను ఎప్పుడూ అల్పజ్ఞుడేనని ప్రతి ఒక్కరూ గుర్తించాలనే !
గోపాలకుని బాధ్యత గోవుల రక్షణ. పశుపతి బాధ్యత పశువుల రక్షణ. కనుక నా రక్షణ బాధ్యత నీదే నని చెప్పి సర్వ సమర్పణ చెయ్యటాన్ని ఇక్కడ చెప్పారు. చిన్నపిల్లలు తమను అమ్మనాన్నలు రక్షిస్తారని ఎంత ధైర్యంగా ఉంటారో, మనం కూడా పరమేశ్వరుడే మనను రక్షిస్తాడని దృఢంగా నమ్మితే నిబ్బరంగా ఉండగలుగుతాము. మనం రక్షణ కోరవలసినది సర్వ సమర్ధుడైన పరమేశ్వరుడినే !

"రక్షకులు లేని వారల
రక్షించెద నంచు చక్రి రాజయ్యుండన్
రక్షింపుమనుచు ఒక నరు
అక్షము ప్రార్ధింపనేల ఆత్మజ్ఞునకున్" !!

పశువు, పాశము పశుపతి  - పదాల విశిష్టతను వివరించు కుందాము.

" పాశ బద్ధః పశుః " అన్నారు. కాల పాశము  చేత, కర్మపాశము చేత బద్ధులైనవారు పశువులు. కాలపాశము, కర్మ పాశము ఎవరి వశంలో  ఉంటాయో వారు పశుపతి.
" పశూన్ పాతి రమతే పునః తేషామధివసతి పాతి ఇతి పశుపతిః " - పశువులను సృష్టించి, వారితో ఆడుకుంటాడు, ఆనందిస్తాడు, వారి యందు నివసిస్తాడు, వారిని రక్షిస్తాడు కనుక మహేశ్వరుడు పశుపతి.
"సర్వథా యః పశూన్ పాతి ఇతి పశుపతిః" అన్ని విధాలుగా పశువులను కాపాడేవాడు పశుపతి. ' పశుపాశ విమోచనుడు ' అని ఈశ్వరుడినీ, 'పశుపాశ విమోచనీ ' అని అమ్మవారిని అంటాము.

" ప్రథమోహ్యేష దేవానాం, తం దేవానాం పరమం చ దైవతమ్ " అనేది వేద ప్రమాణం కనుక దేవదేవుడు మహాదేవుడు శివుడు. ఆ శివుని సహస్ర నామాలలో "పశుపతి " నామం ఒకటి. ఈ పేరుతో ఉన్న 'పశుపతినాథ్ ఆలయం' నేపాల్ లో ఉన్నది. దైవ నామాలలో కొన్ని దైవ మహత్వాన్ని, విభుత్వాన్ని చూపించేవి అవుతాయి. కొన్ని నామాలు దైవము చేసిన పనుల వల్ల, అనగా చూపించిన లీలల వల్ల ఆ పేర్లు వస్తాయి. శంభుః, శివః మొదలైనవి పరమేశ్వరుని విభుత్వాన్ని తెలియజేసే నామాలు. ఈశ్వరుడు చేసిన త్రిపురాసుర సంహార కార్యం - లీల వలన త్రిపురాంతకుడు, త్రిపురహరుడనే నామం వచ్చింది. పశుపతి నామం ఈశ్వరుని మహత్వాన్ని తెలియజేస్తోంది.

జీవులమందరమూ కాల పాశానికి బద్ధులము, కర్మ పాశానికి బద్ధులము. అజ్ఞాన పాశానికి, మోహపాశానికి బద్ధులము.  కాల బద్ధులైన, కర్మ బద్ధులైన  వారందరూ పశువులే ! ఎవరు ప్రకృతికి అధీనులై ఉంటారో వారు పశువులు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అందరూ కాల బద్ధులు. ఎవరి ఆయుః ప్రమాణం తీరగానే వారు వెళ్ళి పోవలసిందే ! పశువులు పాశము ప్రకృతి ఎవరి అధీనంలో ఉంటుందో, ఆయన పశుపతి. కాలబద్ధులైన జీవులను వారి ఆయుః ప్రమాణం తీరగానే కాలపాశం వేసి, ఆ జీవుడిని లాగి  యమధర్మరాజు తీసుకుని వెళ్ళి పోతాడు. అటువంటి యముని పాశాన్ని కూడా నిగ్రహించగలిగిన పశుపతి పరమేశ్వరుడు. నిగ్రహానుగ్రహ సమర్ధుడు.
అనన్య భక్తితో తనను ఆశ్రయించిన భక్త మార్కండేయుని ప్రాణాలను తియ్యటానికి పాశం వేసిన యముని కాలపాశాన్ని నిగ్రహించిన కాలకాలుడు పశుపతి. పశుపతి దగ్గర ఉన్న అస్త్రము పాశుపతాస్త్రము.
పశువు, పాశము, పశుపతి - ఈ మూడు పదాల అర్ధము తెలుసుకోవటమే నిజమైన జ్ఞానము. ఈ మూడింటి జ్ఞానము ఎవరికి ఉంటుందో వారు కాలపాశం నుంచి విముక్తులవుతారు.  పాశము అంటే పశువులను బంధించే తాడు. పశుపతి యొక్క జ్ఞానమును పాశుపతము అంటారు. ఎవరు పశుపతి జ్ఞానం కలిగి ఉంటారో, అంటే పాశుపతమును ఆరాధిస్తారో, వారిని పశుపతి పశుపాశ బంధం నుంచి విముక్తులను చేస్తాడు. పాశంలో  తగుల్కొన్నవాడు జీవుడు. ఏ జీవుడు పాశ విముక్తుడవుతాడో, అతడు శివుడవుతాడు. అంటే, పశుపతి అనుగ్రహంతో పశుపాశం నుంచి విడుదల పొందిన జీవుడు పరమేశ్వరునిలో ఐక్యమవుతాడు. తానే శివుడవుతాడు. జీవుల కర్మల ననుసరించి వారికి ఉపాధులు లభిస్తాయి. ఉపాధులతో కర్మలు చేస్తారు. కర్మ ఫలాల ననుభవిస్తుంటారు.
'పశుం మాం పాలయ ప్రభో ' అని ప్రార్ధించాలి. ఆయన పశుపతి కనుక, సర్వజ్ఞుడు, సర్వ శక్తిమంతుడు కనుక మనలను పాలించ గలడు. లౌకికమైన పశు పాలకులు పశువులను కాస్తారు, రక్షిస్తారు, ఆవసరాలు తీరుస్తారు కానీ, జీవికి కావలసినవన్నీ ఇవ్వలేరు. పశుపతి అయిన పరమాత్మ రక్షించటము, అవసరాలు తీర్చటమే కాదు, అనాది అవిద్యను నశింపజేసి, నిశ్శ్రేయస్సును కూడా అనుగ్రహించ గలడు.

అర్జునుడు పాశుపతాస్త్రము పొందటం కోసం ఈశ్వరుడిని గురించి తపస్సు చేయగా, ఈశ్వరుడు కిరాత రూపంలో వచ్చి, అర్జునునితో ద్వంద్వ యుద్ధం చేసి, అతని పరాక్రమాన్ని పరీక్షించి, పాశుపతాస్త్రాన్ని ఉపదేశించాడు. ' 'పాశుపతాస్త్రోపదేశముం జేసెద పరుల గెల్వుము ప్రతాపంబు మీర ...' అని అనుగ్రహించాడు.
అర్జునుడు పాశుపతాస్త్రమును సంపాదించుకున్నాడే కానీ కురుక్షేత్ర యుద్ధంలో దాన్ని ప్రయోగించలేదు. జగన్మాత మటుకు భండాసురాది రాక్షస సంహార సమయంలో మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి, రాక్షస సంహారం చేసింది.
' మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా.'

శ్రీకృష్ణ పరబ్రహ్మ మహేశ్వరుని తత్త్వాన్ని గురించి తెలుసుకోవటానికి, ఈశ్వర మంత్రోపదేశం పొందటానికి వెతుక్కుంటూ హిమాలయాలలో ఉన్న ఉపమన్యు మహర్షి ఆశ్రమానికి వెళ్ళి, ఆయన దగ్గరి నుంచి సంపూర్ణ శివతత్త్వాన్ని గ్రహించి, పశు, పాశ, పతి గురించి విస్తారంగా తెలుసుకున్నాడు. అనన్య అచంచల అఖండ అవ్యభిచారిణీ నైష్ఠికీ భక్తి కలిగిన ఉపమన్యువును శివపార్వతులు తమ కుమారునిగా ఆదరించి అనుగ్రహించారు. అటువంటి భక్తి, నిష్ఠ మనలో ఉంటే, మనం కూడా ఈశ్వరుని సంపూర్ణ కటాక్షాన్ని పొందగలము.

మనమే పరమాత్మ స్వరూపులమైనా, మన శరీరమంతటా పరమాత్మ చైతన్యమే ప్రసరిస్తూ ఉన్నా, మన హృదయంలోనే పరమాత్మ కొలువై ఉన్నా, మనకు ఆ పరమాత్మ ఉనికిని గ్రహించగల జ్ఞానం కలిగే దాకా శాస్త్రోక్త విధానంలో సాధన చెయ్యాలి. ఆ సాధన జపము, తపము, అర్చన, హోమము, శ్రవణము, కీర్తనము, మననము లాంటి అనేక పద్ధతులలో ఏ పద్ధతిలోనైనా కావచ్చును. అన్నీ కూడా కావచ్చును. ప్రాణాయామము చేస్తూ, శ్వాసతో మంత్ర నామాన్ని, దైవ నామాన్ని అనుసంధానం చెయ్యవచ్చును.
మనం ఉచ్ఛ్వాసతో - అంటే గాలి పీల్చేటప్పుడు పరమేశ్వరుని స్మరిస్తూ "నీవు పశుపతివి" అనీ, నిశ్శ్వాసలో - అంటే గాలి వదిలి పెట్టేటప్పుడు " నేను పశువును" అని అంటూ  చెయ్యటం వలన అది పశుపాశవిమోచనను కలిగించే మహాశక్తిమంతమైన మంత్రంలా మారి మనలను ఉద్ధరిస్తుంది. మనం గాలి పీల్చేటప్పుడు "నీవు పశుపతివి, నిన్ను నాలోనికి తీసుకుంటున్నాను" అంటూ, విశ్వమంతా నిండి ఉన్న వాయుస్వరూపుడైన ఈశ్వర శక్తిని పశుపతిగా భావన చేస్తూ లోపలికి తీసుకుంటున్నాము. అప్పుడు విశ్వాత్ముడైన పరమేశ్వర శక్తి మనలో ప్రవేశించి, మన శరీరములోని ప్రతి అణువు శివశక్తి భరితమవుతుంది. మనం గాలి వదిలేటప్పుడు, మన నిశ్శ్వాసతో మనలో ఉన్న పశుతత్త్వమును "నేను పశువును, పశుత్త్వాన్ని వదిలేస్తున్నాను" అని భావిస్తూ బైటికి వదిలేస్తే, క్రమక్రమంగా మనలోని పశులక్షణాలైన అజ్ఞానము, తంద్రత, సోమరితనము, కామక్రోధాది దుర్గుణాలు అన్నీ నెమ్మది నెమ్మదిగా మనలోనుంచి బైటకు వెళ్ళిపోతాయి. ఈ విధమైన సాధన వలన పశువు యొక్క పాశాలు తెగిపోయి, పశువు పశుపతిగా మారిపోతుంది. అదే " అహం బ్రహ్మా2స్మి" అనుభవం.

🙏🙏🙏🌹🌹

డా.టి.(ఎస్) విశాలాక్షి

No comments:

Post a Comment