Search This Blog

Saturday, November 10, 2018

ప్రణవము--డా.టి.(ఎస్)విశాలాక్షి praṇavamu--డా.ṭi.(es)viśālākṣi

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

           ప్రణవము.
         ----------------

ఓంకార బిందు సంయుక్తం
నిత్యం ధ్యాయంతి యోగినః !
కామదం మోక్షదం చైవ
ఓంకారాయ నమో నమః !!

ఓంకార బిందువుతో (బిందువుతో కూడిన ఓంకారముతో) యోగులు నిత్యము ధ్యానం చేస్తారు. సర్వ కామనలను తీర్చేది, మోక్షమును కలిగించేది అయిన ఓంకారమునకు నమస్కారము.

ఓంకారము కామదం, మోక్షదం. కనుక అన్ని ఆశ్రమముల వారికీ, ఎవరికి ఏది ఇవ్వాలో, వారికి వాటిని ఇవ్వగల శక్తి కలది ఓంకారము.

'ఓమిత్యేకాక్షరమిదం సర్వమ్' అని ఉపనిషత్తులు చెప్తున్నాయి.

సృష్టి స్థితి లయలకు మూల కారణమైన పరబ్రహ్మ వాచకము ప్రణవము. ప్రణవము అంటే ఓంకారము. ఓంకారంలోనుంచే సృష్టి అంతా ఆవిర్భవించిందని ఉపనిషత్తులు చెప్తున్నాయి.

మన కంటికి కనిపించేదంతా ఓంకారమే ! భూత భవిష్యద్వర్తమానాలలో ఉన్నది ఓంకారమే ! త్రికాలాతీత పరబ్రహ్మము ఓంకారమే !
కనుపించే విశ్వానికి మూలకారణమైన అదృశ్యం గా ఉండే పరతత్త్వాన్ని ఉపనిషత్తులు ఓంకారం అని ప్రతిపాదించాయి. ఓంకారము శబ్దబ్రహ్మము. విశ్వము ఉద్భవించినది ఓంకాలంలో నుంచే ! విశ్వమును - దాని పైకి వెళ్ళి వినగలిగితే, వినిపించే శబ్దం ఓంకారము. ప్రత్యక్ష పరబ్రహ్మ శ్రీసూర్యభగవానుని లో నుంచి అవిచ్ఛిన్నంగా వినిపించే నాదము ఓంకారమే నని ఎప్పుడో మన మహర్షులు చెప్పిన సత్యాన్ని ఇప్పుడు విజ్ఞాన శాస్త్ర వేత్తలు యంత్రాల సహాయంతో నిరూపించారు. ఓంకారమే సమస్త అక్షరముల సముదాయమని నిరూపించ బడింది. ఓంకారమే నిత్యము, సత్యము, సర్వమూ అనీ, జాగ్రత్ స్వప్న సుషుప్తులలో ఉంటూ, తురీయమైనది ఓంకారమేననీ, సృష్టి స్థితి లయలు ఓంకారమేననీ మాండూక్యోపనిషత్తులో నిరూపించారు.

ప్రపంచమంతా నామరూపాత్మకం. రూపం కంటికి కనిపిస్తుంది. దానికి ఒక నామం ఉంటుంది. ఆ నామం శబ్దము, ధ్వని. అది పుట్టింది ఓంకారం లోనుంచే ! 'నామము' 'నామీ' ని తెలియజేస్తుంది. నామము అంటే పేరు. నామీ అంటే, దేనికి ఆ పేరు ఉన్నదో, అంటే ఆ నామము ఏ వస్తువును సూచిస్తోందో, అది నామీ - నామము కలది. నామము ఓం, ఓంకారము - 'అ ఉ మ' లు. ఆ నామము చేత, అనగా ఓంకారము చేత తెలియబడేది నామీ - పరబ్రహ్మము.
మనం చూస్తున్న ఈ విశాల విశ్వంలోని నానాత్వానికి ఆధారంగా ఏదైనా మౌలిక పదార్ధం ఉన్నదా ? అదేమిటి ? అనే ప్రశ్నలకు సమాధానమే ఓంకారము. ఒక్క మూలాధార వస్తువుతో అనేక వస్తువులను తయారు చేస్తాము. ఒక్క బంగారంతో అనేకమైన పేర్లు కల అనేక రకాల ఆభరణాలను - గొలుసులు, గాజులు, దుద్దులు, ఉంగరాలు, ఒడ్డాణ్ణం, నెక్లెస్ లు ఇలా అనేక విధాలుగా తయారు చేస్తాము.
ఒక్క మూల పదార్ధమైన మట్టితో కుండలు, ముంతలు, కుండీలు, తొట్టెలు మొదలైనవి తయారు చేస్తాము. అలాగే ఒక్క ఓంకారం లోనుంచే నానాత్వం కలిగిన ఈ విశ్వం తయారయింది. 'వాచారంభణం వికారో నామధేయమ్ ! మృత్తికేత్యేవ  సత్యమ్' ! అంటున్నది ఉపనిషత్తు.  అలాగే 'అ ఉ మ' - లు ఓం లోనే ఉండి ఓంగా పరిణమిస్తున్నాయి.
అ కి ఉ కలిస్తే ఓ గా మారుతుంది అని చిన్న పిల్లలు కూడా తరగతి గదిలో సంధుల గురించి తెలుసుకుంటున్నారు కదా ! అ + ఉ = ఓ. దానికి 'మ్' చేరిస్తే, ఓమ్ అవుతుంది. అంటే ఒక్క 'ఓం' లో అ ఉ మ అనే అనేకం ఉన్నాయి కదా !

'అ అనటానికి నోరు తెరుస్తాము. అది సృష్టికి సంకేతం. 'ఉ' అంటున్నప్పుడు అది విస్తరిస్తోంది. అది స్థితి అన్నమాట. 'మ' ' మ్' అన్నప్పుడు తెరిచిన నోరు మూసుకు పోతోంది. అదే లయము. అంటే ఓంకారములోనే సృష్టి స్థితి లయలు ఉన్నాయి.
ఓం - ఒక్క అక్షరంగా, ఒక్క శబ్దంగా ఉన్నప్పుడు అది పరబ్రహ్మము. అవ్యక్త బ్రహ్మము. అందులో - ఆ ఉ మ లు అంతర్గతమై ఉన్నాయి. అవి బహిర్గతమైనప్పుడు, అదే శబ్ద ప్రపంచము, వ్యక్త బ్రహ్మము. అక్షరాలన్నీ అందులో నుంచే వచ్చాయి. అదే ఈ విశ్వము, సృష్టి. విశ్వము అనే సాధనంతో ఓంకారము అనే పరబ్రహ్మను తెలుసుకోవాలి. ఈ సర్వము అని ఏది చెప్పబడిందో, అది బ్రహ్మము. ఓంకారమే సర్వానికీ ఆశ్రయం. రెండింటికి భేదం లేదు. కనుక ఓంకారమును తెలుసుకుంటే, పరబ్రహ్మము తెలిసినట్లే !
రజ్జు సర్ప భ్రాంతి గురించి తెలుసు కదా ! తాడులో పాము ఆరోపించ బడింది. కనుక సర్పాది వికారాలకు ఆశ్రయం రజ్జువు. వాక్ ప్రపంచానికి ఆశ్రయం ఓంకారము. అయితే, అక్కడ ఉన్నది తాడు, భ్రాంతి పాము. ఇక్కడ ఉన్నది ఓంకారము, భ్రాంతి విశ్వము. ప్రాపంచిక శబ్దాలన్నీ ఓంకార వికారాలే ! ఓంకారము దారము. వాక్కు దారము. ఈ ప్రపంచమంతా ఆ దారంతో అల్లబడిన పూలమాల. ఓం ను ఆత్మతో అనుసంధానించాలి. ఓంకారంలో ఉన్న అ ఉ మ లు - స్ధూల సూక్ష్మ కారణ శరీరాలకు ప్రతినిధులు. అవి జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలను చెప్తున్నాయి.
'అ' ని 'ఉ' లో కలిపి 'ఉ' ని 'మ' లో కలిపి 'అ ఉ మ' లు మూడింటిని బిందువులో లయం చేస్తే, మిగిలేది ఓంకారమే ! 
అలాగే, జాగ్రదవస్థను స్వప్నావస్థలో, స్వప్నావస్థను సుషుప్తిలో, సుషుప్తిని తురీయంలో లయం చేస్తే, తురీయమే మిగులుతుంది. ఓంకారమనే ప్రతీకతో పరబ్రహ్మమును ఈ  మాండూక్యోపనిషత్తులో చెప్పారు.
మాండూక్యకారికలలో -

సర్వస్య ప్రణవోహ్యాదిః మధ్యమన్త స్తథైవచ!
ఏవం హి ప్రణవం జ్ఞాత్వా
వ్యశ్నుతే తదనంతరమ్ !!
అని చెప్పబడింది.

విశ్వమంతటికీ ఆది, మధ్య, అంతము కూడా ఓంకారమే ! దానిని తెలిసు కొనటం వలన పరమ ప్రయోజనం పొందగలడు.

ప్రణవం హీశ్వరం వింద్యాత్ స్సర్వస్య హృది సంస్థితం!
సర్వ వ్యాపినమోంకారం మత్వా ధీరో నశోచతి !!

సర్వప్రాణుల హృదయాలలో ఈశ్వరునిగా ఉన్నది ఈ ఓంకారమే అని గ్రహించాలి. సర్వవ్యాపి అయిన ఓంకారాన్ని గ్రహించగలిగితే ఇంక శోకమనేది ఉండదు.

కఠోపనిషత్తు లో  యమధర్మరాజు నచికేతునికి  చెప్తున్నాడు  -
సర్వే వేదా యత్పదమామనన్తి  !
తపాంసి  సర్వాణి  చ యద్వదన్తి  !
యదిచ్ఛన్తో  బ్రహ్మ చర్యం  చరన్తి
తత్తే  పదం  సంగ్రహేణ  బ్రవీమ్యోమిత్యేతత్  !!

సమస్త  వేదములు  ఏ  వస్తువును  లక్ష్యంగా  చెప్తున్నాయో,  చాంద్రాయణాది  రూపములగు తపస్సులన్నీ ఏ వస్తువును పొందటమే ప్రయోజనంగా కలిగి  ఆచరింపబడుతున్నాయో,  ఏ వస్తువును  కోరి  బ్రహ్మచర్యము నవలంబించుచున్నారో,  అట్టి  పరమ పదమును  గురించి సంగ్రహముగా చెప్పుచున్నాను. ఆ పరమ పదమే  ప్రణవము  - ఓంకారము.

ఏతద్ధ్యేవాక్షరం బ్రహ్మ ఏతద్ధ్యేవాక్షరం పరం !
ఏతద్ధ్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్  !!

ఆ అక్షరమే బ్రహ్మ,  ఆ అక్షరమే అన్నింటి కంటే గొప్పది. ఈ అక్షర పరబ్రహ్మమును తెలుసుకున్న వారికి సర్వ కార్యములు సిద్ధించును.

ఓంకారములో 'అ ఉ మ' లు స్ధూలంగా కనిపిస్తాయి. కనుపించకుండా అంతర్గతంగా - అ ఉ మ లతో పాటుగా - బిందు, నాద, కళ, కళాతీత, పరాత్పర - అనే అంశాలు కూడా ఉన్నాయని తారసారోపనిషత్తులో చెప్పారు. అక్కడ
పరివార రామచంద్రమూర్తిని ఓంకారంతో చెప్పారు.
 శ్రీరామోత్తరతాపిన్యుపనిషత్తులో కూడా ప్రణవ మందు అకార, ఉకార, మకార, అర్ధమాత్ర, బిందువు, నాదము అనే ఆరు భాగములు ఉన్నాయనీ, ఈ ఆరు భాగములు కలిగిన ఓంకారమే తారక మంత్రమనీ, ఈ తారక మంత్ర వాచ్యుడు శ్రీరామచంద్రుడని  చెప్పారు.

అమృతనాదోపనిషత్తులో కూడా - సర్వ సంగ పరిత్యాగులైన యోగులు ఏ విధంగా తరించాలో చెప్పారు.

'ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఓమిత్యేతేన రేచయేత్, దివ్య మంత్రేణ బహుధా కుర్యాదామల ముక్తయే ...'
ఏకాక్షరమును పరబ్రహ్మ స్వరూపమును నగు ఓంకారముతో బ్రహ్మ ధ్యాన పూర్వకముగా రేచకము సలుపాలి.ఈ విధంగా పలుమార్లు రేచక పూరకములు చేస్తూ, మనస్సులోని మాలిన్యాలను నశించి పోయే వరకు ప్రాణాయామములను చేస్తూ ఉండాలి. ఇలా చెప్తూ, ఓంకారమును ఇలా చెప్తారు.
" అఘోష మవ్యంజనమస్వరం చ యత్తాలు దంతోష్ఠ సునాసికం చ యత్ ! అరేఫజాత ముభయోష్మ వర్జితం యదక్షరం న క్షరతే కథంచిత్ !
యేనా2సౌ గచ్ఛతే మార్గం ప్రాణం తేనాభిగచ్ఛతి, అతస్తమభ్యసేన్నిత్యం యన్మార్గ గమనార్హం వై ...'

ఆ అక్షరము (ఓంకారము) ఘోష లేనిది, వ్యంజనము కానిది, స్వరము లేనిది, తాలువులు, దంతములు, నాసిక - వీటితో సంబంధము లేనిది, నశించనిది. ఈ ప్రణవము పయనించే మార్గాన్ని అనుసరించి ప్రాణవాయువు పయనిస్తుంది.  ప్రాణవాయువు ఏ మార్గంలో చరిస్తుందో, ఈ అక్షరము కూడా అదే మార్గంలో పయనిస్తూ ఉంటుంది. అటువంటి ప్రాణాయామ మార్గాన్ని నిత్యము అభ్యాసం చెయ్యాలి. హృదయ ద్వారము, వాయు ద్వారము, బ్రహ్మరంధ్ర ద్వారము ఇవన్నీ మోక్ష ద్వారములు.

ఒక ప్రతిమలో భగవంతుని భావించి, ఉపాసిస్తున్నట్లుగానే, బ్రహ్మ ప్రతిపత్తికి ఓంకారము ఆలంబనం.

ఓంకారమును జపిస్తున్నా, ఓంకార సహిత మంత్రాన్ని జపిస్తున్నా, మనలోని చైతన్యము విశ్వ చైతన్యంతో అనుసంధానించ బడుతుంది. సాధనతో మనమే విశ్వ చైతన్యముగా మారగలుగుతాము.

ఏ మంత్రానికైనా ముందు ఓంకారం ఎందుకు పెడతామంటే - తస్య వాచకః ప్రణవః అని శ్రుతి చెప్తోంది కదా ! పరబ్రహ్మ వాచకము ప్రణవము - ఓంకారము. ఉన్నది ఒకే ఒక్క పరతత్వము. ఆ ఉన్న ఒక్క తత్త్వాన్నే అనేక నామరూపాలతో ఆరాధిస్తాము. కనుక ఏ దైవాన్ని ఆరాధిస్తున్నా, ఓంకారంతో కలిపి చెప్పేటప్పటికి ఆ మంత్రం పరబ్రహ్మదవుతుంది, పరమాత్మను ఆరాధించినట్లవుతుంది. ఇన్ని నామరూపాలతో మనం ఆరాధిస్తున్నది ఒకే ఓంకార వాచ్యుడైన పరమాత్మను అనే జ్ఞానం కలుగుతుంది. నామరూపాలే భిన్నం. భవంతుడు ఒక్కడే అన్న సత్యం బోధ పడుతుంది.

ఓంకారాన్ని జపిస్తున్నా, ఉపదేశించ బడిన మంత్ర జపం చేస్తున్నా, మన మహర్షులు బోధించిన పతంజలి రాజయోగ సాధన చేసినా, సాధనా బలం పెరుగుతుంటే, మన శరీంలోని మూలాధార చక్రంలో నిద్రాణ స్థితిలో ఉన్న కుండలినీ శక్తి ప్రేరేపించబడి, షట్చక్రముల ద్వారా పైకి వ్యాపిస్తూ, సహస్రార చక్రాన్ని చేరి బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంది.

   🙏🙏 ఓం తత్సత్  🙏🙏

రచన :
డా.టి.(ఎస్)విశాలాక్షి
సెల్ నంబర్ - 9966529033
వాట్శాప్ నంబర్ - 9963964033.
🙏🌹

Friday, September 7, 2018

శివానందలహరి శ్లోకం 10

ఓం నమశ్శివాయ
శివానందలహరి శ్లోకం 10

నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్ |
సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరీ
విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా ? || 10 ||
శ్లోకం
పదాన్వయము, అర్ధతాత్పర్యములు -

నరత్వం, దేవత్వం, నగ, వన, మృగత్వం, మశకతా, పశుత్వం, కీటత్వం, విహగత్వ, ఆది, జననమ్, భవతు, హృదయమ్, ఇహ, సదా, త్వత్, పాదాబ్జ, స్మరణ, పరమానంద, లహరీ, విహార + ఆసక్తం చేత్, తేన, వపుషా, కిం?

నరత్వం = మనుష్యునిగా కానీ
దేవత్వం = దేవతగా కానీ
నగ = పర్వతము గా
వన = అరణ్యముగా
మృగత్వం = జంతువులా కానీ
మశకతా = దోరగా కానీ
పశుత్వం = అనువుగా కానీ
కీటత్వం = పురుగుగా కానీ
జననమ్ = పుట్టుక
భవతు = కలుగు గాక
హృదయమ్ = హృదయమందు ( ఏ ప్రాణి గా పుట్టినా ఆ ప్రాణి హృదయంలో )
ఇహ = ఈ లోకంలో
సదా = ఎల్లప్పుడూ
త్వత్ = నీయొక్క, ఈశ్వరుని యొక్క
పాదాబ్జ = పాద పద్మముల యొక్క
స్మరణ = స్మరణ వలన కలిగే
పరమ + ఆనంద = ఉత్కృష్టమైన ఆనందము అనే
లహరీ = ప్రవాహము నందు
విహార = విహరించటానికి
ఆసక్తం చేత్ = ఆసక్తి కలిగినదైతే
తేన = దానిచేత( అటువంటి జన్మ వలన )
వపుషా = శరీరముతో, ఆ ఉపాధితో
కిం = ఏమి నష్టము ?

మనుష్యుడుగా గానీ, దేవుడుగా గానీ, పర్వతముగా గానీ, అడవిగా గానీ, మృగముగా గానీ, దోమగా గానీ, పశువుగా గానీ, పురుగుగా గానీ, పక్షులు మొదలగు వానిగా ఎలా పుట్టినా ఫరవాలేదు. కానీ ఎల్లప్పుడూ నా మనస్సు నీ పాదపద్మముల స్మరణలో పరమానందముగా విహరించుట యందు ఆసక్తి కలిగి ఉన్నట్లైతే, ఇంక ఏ జన్మ వచ్చినా ఏమి నష్టము ? అంటే, ఏ జన్మలభించినా నష్టము లేదని అర్ధము.
పైన చెప్పబడిన వాటిలో ఎటువంటి ఉపాధి లభించినా, నీ పాద పద్మములను స్మరించటం వల్ల కలిగే మహదానందము లభిస్తే, ఆ జన్మ ధన్యత నొందుతుంది.

మనకు ప్రారబ్ధ వశమున ఏ జన్మైనా రావచ్చును. కానీ ఆ జన్మలన్నింటిలోనూ, తన హృదయంలో ఈశ్వర పాదారవింద స్మరణము మాత్రము కలిగేటట్లుగా అనుగ్రహించమని ఈ శ్లోకంలో జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రార్ధిస్తున్నారు. ఈశ్వర అనుగ్రహము, ఈశ్వర స్మరణ ఉంటే, ఏ ఉపాధి అయితే ఏమి ? ఆ దేహానికి ఏమి లోటు ? అంటున్నారు.

జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులే తమ వివేకచూడామణిలో మదటి శ్లోకంలోనే
' జంతూనాం నర జన్మ దుర్లభమ్...' అన్నారు. ఎందుకంటే, మానవ జన్మలో జ్ఞానము పొందే అవకాశాలు అనేక రకాలుగా ఉన్నాయి. మానవులకు మోక్ష సాధన సామగ్రి చాలా ఉంటుంది. మానవులు మాట్లాడ గలరు కనుక దైవ సంకీర్తన చెయ్యగలరు, భగవత్కథలను చదవగలరు, పూజ చెయ్య గలరు, దైవ మందిరాలకి, క్షేత్రాలకి, తీర్ధాలకీ వెళ్ళ గలరు, సత్సాంగత్యం చెయ్యగలరు, గురువుల నాశ్రయించి, జ్ఞానము సంపాదించి ముక్తి పొంద గలరు.
అటువంటి దుర్లభమైన మానవ జన్మ లభించినప్పుడు దానిని చరితార్ధ మొనరించు కోవాలి కదా ! కానీ ఎంత మంది తమ మానవులు తమ జీవితాన్ని సద్వినియోగ పరచుకో గలుగుతున్నారు ? కనుక ఈశ్వర భక్తి, దైవ స్పృహ లేని మానవ ఉపాధి కంటే, భగవంతుని యందు భక్తి కలిగిన ఏ శరీరము లభించినా, జీవుడు తరించ గలడు అని ఆచార్యులు చెప్తున్నారు. ఏ జన్మ ఎత్తినా, ఆ జంతువు హృదయం ఈశ్వరుని స్మరించటం వల్ల కలిగే ఆనందానుభూతిని పొంద గలిగేదిగా ఉండాలి. అయితే, మనుష్యులకు వివేకం ఉంది కనుక, మానవ ఉపాధి కనుక సహజంగానే తరించటానికి చాలా మార్గాలున్నాయి. మరి జంతువులకు, పశు పక్ష్యాదులకు, క్రిమి కీటకాలకు, చెట్లు చేమలకు, రాళ్ళకు మొదలైన వాటికి ఇన్ష్టింక్ట్ అంటారే, దాని వల్ల ఆహార నిద్రా భయాదులే ఉంటాయి. పరిసరావకి సహజంగా ప్రతి స్పందిస్తాయి. మరి వాటికి ఉత్తమ జన్మ ఎలా వస్తుంది, ముక్తి ఎలా వస్తుంది? అంటే, వాటి కర్మ ఫలం వలన పరమ భాగవతోత్తముల స్పర్శ వల్లో, వారి మాటలు వినటం వల్లో, వారి ఉచ్ఛిష్టము భుజించటం వల్లో, క్రిందటి జన్మ సంస్కారం వల్లో అటువంటి సద్గతి లభించి, వారి, వాటి హృదయాలలో కూడా ఈశ్వర భక్తి ఉంటుంది, ఉదయిస్తుంది, వర్ధిల్లుతుంది, తరింప జేస్తుంది.
గజేంద్రుడు, మకరి, బృందావనంలోని గోవులు ముక్తి పొందాయి.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు ' మాం వ్యపాశ్రిత్య పాపయోనయో2పి వరాం గతించిన యాంతి' పాప యోనులైనా, నన్ను ఆశ్రయిస్తే ఉత్తమ గతులు పొందుతారు అని చెప్పాడు. ఏ ఉపాధిలో ఉన్నా ఈశ్వర స్మరణ ఒక పరమానంద లహరి. ఎడతెగని ఆ శివానంద ప్రవాహంలో ఈదులాడేవారు, మునకలేసే వారు ఆ ఆనంద స్వరూపులే అవుతారు.

పరమ శివభక్తులైన శ్రీ పుష్పదంతులవారు ఈశ్వర కటాక్షం కోసం ఎలా ప్రార్ధించారో చూడండి.

దీనో2స్మి జ్ఞాన హీనో2స్మి ప్రణతో2స్మి చ శంకర !
కురు ప్రసాదం దేవేశ అపరాధం క్షమస్వ మే !!
న హి నిర్వహణం యాంతి ప్రభూణామాశ్రితా రుషః !
ప్రసీద దేవ దేవేశ దీనస్య కృపణస్య చ !!
అపి కీట పతంగత్వం గచ్ఛేయం తవ శాసనాత్ !
భక్తో2హం సర్వదా దేవ పుత్రత్వే హి ప్రతిష్ఠత !!

శంకర ! నేను దీనుడిని, జ్ఞానహీనుడిని. సతతము నీకే నమస్కరిస్తాను, నా యందు దయ చూపించు. నా అపరాధాలను క్షమించు. నీవు ఆజ్ఞాపించినట్లైతే, కీటకముగా కానీ, పురుగుగా కానీ ఎలా పుట్టమన్నా పుడతాను. కానీ నన్ను నీ పుత్రుని వలె చూడు. సదా నీ భక్తుడినయ్యేలా అనుగ్రహించు.

'ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశే2ర్జున తిష్టతి' అని భగవానుడే భగవద్గీతలో చెప్పాడు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము గల సకల ఉపాధులందు పరబ్రహ్మము - ఈశ్వరుడు కూటస్థుడుగా ఉండి, సకల ప్రపంచమును నడుపుతున్నప్పుడు సకల ప్రాణికోటికి తమ నిజ స్వరూపమును తెలుసుకుని, పరమాత్మలో లీనమవటానికి అర్హులే కదా ! కానీ, ప్రారబ్ధ వశాన లభించిన ఆ ఉపాధిలో ఉన్న జీవుడికి ఈశ్వర స్మరణ కలిగే సుకృతం ఉండాలి. ఈశ్వర స్పృహ లేనప్పుడు అత్యంత దుర్లభమైన మానవ ఉపాధి లభించినా వ్యర్ధమే ! ఈశ్వర స్మరణ ఉన్నప్పుడు సాలుపురుగులా పుట్టినా, పాములా పుట్టినా, ఏనుగులా పుట్టినా, ఉడతలా పుట్టినా, భల్లూకములా పుట్టినా, జటాయువు వంటి పక్షిలా పుట్టినా, జింకలా జన్మించినా, ఈశ్వరానుగ్రహంతో ముక్తి పొందారు కదా !

ఏ వేదంబు పఠించెలూత? భుజగంబే శాస్త్రముల్ సూచె, తా
నే విద్యాభ్యసన మొనర్చె కరి? చెంచే మంత్ర మూహించె? బో
ధావిర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు నీ పాద సం
సేవాసక్తియె కాక, జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా !!

జీవులకు ముక్తి కలగటానికి నీ పాదాలు సేవించే భక్తి ఉంటే చాలు. ఈశ్వర భక్తులు ముక్తి పొందటానికి వారి జన్మలు అడ్డు రావు.
ఎన్ని కావ్యాలు పఠించినా, ఎన్ని చదువులు చదివినా, ఎన్ని శాస్త్రాలను ఔపోసన పట్టినా, నిర్మలమైన, నిశ్చలమైన, నిష్కపటమైన భక్తి లేకపోతే ముక్తి లేదు, రాదు.

రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా ... అంటూభక్తితో పరవశించి పాడతారు భక్తులు. పరమాత్మ పాదం తగిలితే చాలు దేనిదైనా సరే, జన్మ ధన్యమౌతుంది. వేల సంవత్సరాల క్రితమే అయినా, పరమాత్మ శ్రీకృష్ణునిగా పుట్టి, తిరిగిన బృందావనంలోని మట్టి కణములు ఈశ్వరుని శరీరమునుంచి జారి పడే విభూతి కణములంత పవిత్రములనీ, తాము బృందావనంలో మట్టిలా పుట్టాలని కోరుకుంటారు కృష్ణ భక్తులు. గోపికలు, మహర్షులు కూడా బృందావనంలో వృక్షాలలా పుట్టి, ఈ రోజుకీ శ్రీకృష్ణ లీలలను అనుభవిస్తూ ఆనందిస్తున్నారు.

🙏🙏🙏🌹

డా.విశాలాక్షి

శివానందలహరి శ్లోకం 9

🙏🙏🙏🙏
ఓం నమశ్శివాయ
శివానందలహరి శ్లోకం 9

గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః !
సమర్ప్యైకం చేతస్సరసిజముమానాథ భవ తే
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో !! 9 !!
శ్లోకం
పదాన్వయం, అర్ధతాత్పర్యములు -

ఉమానాథ, భవ, జడమతిః, జనః, కుసుమార్ధం, గభీరే, కాసారే, విశతి, విజనే, ఘోర విపినే, చ, విశాలే, శైలే, భ్రమతి, ఏకః, చేతః + సరసిజం, తే, సమర్ప్య, ఇహ, సుఖేన, అవస్థాతుం, కిం, న జానాతి, అహో !

ఉమానాథ = హే ఉమాదేవి భర్త అయిన సాంబశివా !
భవ = హే భవా ! నిత్యము ఉండునటువంటి స్వామీ !
జడమతిః = మందమతి అయిన
జనః = మానవుడు
కుసుమార్ధం = (నిన్ను పూజించటానికి) పువ్వుల కోసం
గభీరే = లోతైన
కాసారే = తటాకములందు
విశతి = ప్రవేశిస్తున్నాడు
విజనే = మనుష్యులు లేనటువంటి
ఘోరవిపినే = భయంకరమైన అరణ్యములందు
చ = మరియు
విశాలే = విశాలమైన
శైలే = పర్వతముల మీద
భ్రమతి = తిరుగుతున్నాడు.
ఏకం = ఒక్క
చేతః + సరసిజం = మనస్సు అనే పద్మమును
తే = నీకు - నీ కొరకు,
తే బదులు భవతే = నీకు, నీ కొరకు - అని కూడ అన్వయించ వచ్చును.
సమర్ప్య = సమర్పించి
ఇహ = ఇక్కడే, ఈ లోకంలోనే
సుఖేన = సుఖముగా, సంతోషముతో
అవస్ధాతుం = ఉండటానికి, ఉండగలమని
కిం = ఎందుకు
న జానాతి  = తెలుసుకోవటం లేదో !
అహో = ఎంత ఆశ్చర్యము !!

హే ఉమానాథ !
జడుడైన మానవుడు తెలివి లేనివాడై, సులభమైన ఉపాయం తెలియనివాడై, నిన్ను పూజించటానికి పుష్పముల కొరకు లోతైన చెరువులందు దిగుచున్నాడు, నిర్జనమైన భయంకర అరణ్యములందు, విస్తీర్ణమైన పర్వతము లందు తిరుగుచున్నాడు. కానీ  మనస్సనెడి పద్మము ఒక్కటి నీ పాద పద్మముల యందు సమర్పించిన చాలు సుఖముగా ఉండవచ్చును అన్న విషయాన్ని తెలుసుకో లేకుండా ఉన్నాడే ! ఎంత ఆశ్చర్యంగా ఉన్నది !!

ఈ శ్లోకంలో ఆచార్యులు ఉమానాథా ! అని, భవ ! అని సంబోధిస్తున్నారు. ఎందుకంటే, బ్రహ్మ విద్యా స్వరూపిణి ఉమాదేవి, బ్రహ్మజ్ఞానమే మహేశ్వరుడు. ఈ శ్లోకంలో బ్రహ్మవిద్యను -  బ్రహ్మానందమును పొందే మార్గాన్ని తెలియజేస్తున్నారు కనుక ఉమాపతే, అనే నామంతో సంబోధించారు.
ప్రణవములోని 'అ ఉ మ' లే ఉమలో ఉన్నాయి. ఈ బీజాక్షరాలకు వర్ణవిద్య అని పేరు. 'భవుడు' అంటే, ఉన్నవాడు. నిత్యుడు. తననుపాశించే వారిని నిత్యులనుగా చెయ్యగలవాడు.

"అహింసా ప్రధమం పుష్పం
పుష్పమింద్రియ నిగ్రహం !
సర్వభూతదయా పుష్పం
క్షమా పుష్పం విశేషతః !!
శాంతి పుష్పం తపః పుష్పం
ధ్యాన పుష్పం తథైవ చ !
సత్యమష్టవిధం పుష్పం
శంభోః ప్రీతికరం భవేత్" !!

ఈ శ్లొకంలో శ్రీ మహాదేవునకు అత్యంత ప్రీతి పాత్రమైన ఎనిమిది పుష్పముల గురించి చెప్పబడింది. 

వీటిలో అహింస - మనోవాక్కర్మలతో ఎవరినీ బాధించకుండా ఉండటం మొదటి పుష్పము.
రెండవది ఇంద్రియ నిగ్రహము. కోట్ల కోట్ల జన్మ పరంపరకు కారణ భూతమైన ఇంద్రియ లోలత్వాన్ని నిగ్రహించి, నిర్మూలించ గలగటం.
మూడవది    సర్వభూతముల యందు దయ కలిగి ఉండుట. ఇదే అనుకంప. ఇదే సమత్వము.
నాలుగవది క్షమ, తితిక్ష.
ఐదవది శాంతము. నవ రసముల పరాకాష్ట శాంతమే !
ఆరవది తపస్సు. ఏకాగ్రతే తపస్సు.
ఏడవది ధ్యానము, ధ్యానము వల్లే పరమాత్మ దర్శనము సాధ్యము.
ఎనిమిదవది సత్యము.

ఇవీ మనము భగవంతునికి సమర్పింప వలసిన
పుష్పములు.
ఈ సుగుణములను మనం అలవరించుకొని ఆ భగవంతునికి మనం ప్రీతిపాత్రులమవాలి. 

బాహ్యం లో మనం భగవంతునికి పూజ చెయ్యాలి. పుష్పములు సమర్పించాలి.
బాహ్యంలో మనం చేసే పూజతో, మన ప్రవర్తనతో మన మనస్సులో, మన హృదయంలో ఈ ఎనిమిది పుష్పములు వికసించాలి. వాటిని మనం ఆయనకు సమర్పించాలి.

'తోమని పళ్ళాలవాడిని పూయని పుష్పాలతో పూజించాలి అనటం విన్నాము.
భగవంతుని కొందరు బంగారు పూలతో పూజ చెయ్యవచ్చు, కొందరు వెండి పూలతో పూజించవచ్చు, కొందరు మట్టిపూలతో పూజించవచ్చు.  అయితే అన్ని పూలలోకి భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పూవులు - అహింసా ప్రధమం పుష్పం. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పం అహింస. మరో పుష్పం సర్వ భూత దయ. అలాగే మిగతా పుష్పాలు శాంతి, క్షమ, తపస్సు మొదలైనవి.
క్షమా పుష్పం అన్నింటికన్నా విశేషమయినది. ఈ పూవులు ఏ చెట్టుకీ పూయవు, ఎంత ధనమిచ్చినా కొనలేము. కేవలం పూర్వజన్మ సంస్కారం వలన, మన నడవడి బట్టే ఈ పుష్పాలను సంపాదించవచ్చును.

ధర్మము, సత్యం, దానం, సహనం, ధ్యానం, తపస్సు, శాంతి, క్షమ లాంటి దైవ గుణాలు మన మలవరచుకోవటం వలన, ఈ గుణాలనే భగవంతునికి పూజా పుష్పాలుగా సమర్పించటం వలన మనం భగవంతుని అనుగ్రహాన్ని తప్పక పొందగలము. భగవంతుని మీద నమ్మకం లేనివాళ్ళు కూడా ఈ గుణాలను అలవరచుకోవటం వలన సామాజికంగా ఎంతో ప్రశాంతత నెలకొంటుంది, శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తాయి.

తొండమాన్ చక్రవర్తి తాను పరమ భక్తుడననీ, సాక్షాత్తుగా శ్రీనివాసుడే తనతో మాట్లాడుతున్నాడని కించిత్ గర్వభావం పొందాడట. వెంటనే శ్రీవేంకటేశ్వర స్వామి అతని అహంకారాన్ని పోగొట్ట దలిచాడు. మర్నాడు తొండమాన్ చక్రవర్తి స్వామిని పూజించటానికి వచ్చేప్పటికి అతను పూజించిన బంగారుపూల మీద బంకమట్టితో చేసిన పూలు కనిపించాయి. అతను ఆశ్చర్యపోయాడు, బాధ పడ్డాడు. నాకంటే మించిన భక్తులు నీకున్నారా ? అని శ్రీవేంకటేశ్వర స్వామిని అడిగాడు. తన పరమ భక్తుడు భీముడు అనే కుమ్మరివాడు అని చెప్పాడు పరమాత్మ. అతను ప్రతి రోజు పని ప్రారంభించే ముందు బంకమట్టితో పూలు చేసి, తన ఇంట్లో గూట్లో పెట్టుకున్న చెక్కతో చేయబడిన వేంకటేశ్వరస్వామిని ఆ మట్టిపూలతో పూజిస్తున్నాడు. భక్తితో సమర్పించే దేనినైనా స్వామి స్వీకరిస్తాడు. అహంకారంతో వజ్రవైఢూర్యాలిచ్చినా వద్దుపొమ్మంటాడు.

నిజానికి పూజలో పుష్పము ఒక ప్రతీక మాత్రమే ! ముని వేళ్ళతో పూవును పట్టుకుని మన హృదయానికి తాకించి భగవంతునికి సమర్పించాలి. అంటే అర్ధం తాను సమర్పించేది బాహ్యంలో దొరికే కుసుమాలు మాత్రమే కాదు, హృదయ పుష్పాలను సమర్పిస్తున్నానని చెప్పటమే ! 'త్వదీయం వస్తు పరమేశ తుభ్యమేవ దదామ్యహం'. 'మనోపుష్పం సమర్పయేత్'. అన్నారు. మనో పుష్పం సమర్పించటమంటే, ఇంద్రియాలను, మనస్సును, హృదయాన్ని సమర్పించటమే !

'మనో నాశో మహోదయః'
'మనో లయమే మోక్షము'.
మానసిక పూజ
మనో పుష్పాన్ని సమర్పించే స్థితి వచ్చే వరకూ బాహ్య పూజ చేస్తూనే ఉండాలి.
పరమాత్మను చతుష్షష్ట్యుపచారాలతో పూజించాలి.  కుదరకపోతే,  షోడశోపచారాలతో  పూజించాలి.
షోడశోపచారాలలో సహజమైన సుగంధము, సౌకుమార్యము కలిగిన  పుష్పానికి ప్రత్యేకత ఉన్నది. పూజలో ముందు పుష్పాలు సమర్పించినా, పూజ చివరిలో ఆ పుష్పాన్ని మంత్రపూతం చేసి 'మంత్ర పుష్పం ' సమర్పిస్తాము. షోడశోపచారాలతో కూడా పూజించలేనివారు
కనీసం మనకు  పంచేంద్రియాలను  ఇచ్చినందుకు  కృతజ్ఞతగా  పంచోపచారాలతో నైనా  పూజించి, మనస్సు  అనే మంత్ర పుష్పాన్ని  సమర్పించాలి.
మనలోని ఇంద్రియాలను,  మనస్సును మంత్రంతో  అనుసంధానం చేసి, మాలిన్యాలు తొలగి మంత్రపూతమైన మనస్సును సమర్పించటమే  మంత్రపుష్ప సమర్పణ.
ఎంతో కష్టపడటం కంటే, సులభమైన ఉపాయంతో పరమాత్మ అనుగ్రహం పొందవచ్చును. ఒకప్పుడు గణాధిపత్యం ఎవరికివ్వాలి ? అనే మీమాంస కలిగినప్పుడు వినాయకుడు, కుమారస్వాములలో ఎవరు ముందు త్రిలోక ప్రదక్షిణ చేసి వస్తే, వారికే గణాధిపత్యం ఇస్తానని సాంబసదాశివుడు  చెప్తాడు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనం మీద త్రిలోక సంచారానికి బయలు దేరాడు. తెలివి, బుద్ధి సూక్ష్మత కలిగిన వినాయకుడు తల్లితండ్రులకు ముమ్మారు ప్రదక్షిణ చేసి, వారి పాదాలు కడిగి, నీరు తల మీద చల్లుకున్నాడు. త్రిలోక ప్రదక్షిణ చేసిన ఫలం దక్కించుకున్నాడు. కనుక భక్తి, శ్రద్ధలతో సులభంగా పరమేశ్వరుని అనుగ్రహం పొందవచ్చును.

సత్యం మాతా పితా జ్ఞానం
ధర్మో భ్రాతా దయా సఖా !
శాంతిః పత్నీ క్షమా పుత్రః
షడేతే మమ బాంధవాః !!

🙏🙏🙏🌹

డా.విశాలాక్షి.

శివానందలహరి శ్లోకం 8

ఓం నమశ్శివాయ
శివానందలహరి శ్లోకం 8

యథా బుద్ధిశ్శుక్తౌ రజతమితి కాచాశ్మని మణిః
జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలమ్ !
తథా దేవ భ్రాంత్యా భజతి భవదన్యం జడజనో
మహాదేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే || 8 ||
శ్లోకం
పదాన్వయము, అర్ధతాత్పర్యములు -

పశుపతే !, జడజనః, మహాదేవ + ఈశం, త్వాం, మనసి, న మత్వా, శుక్తౌ, రజతమ్, కాచాశ్మని, మణిః, పైష్టే, జలే, క్షీరమ్, మృగతృష్ణాసు, సలిలమ్, ఇతి, బుద్ధిః, యథా, భవతి, తథా, భవత్, అన్యమ్, దేవభ్రాన్త్యా, భజతి.

పశుపతే ! = హే పశుపతీ !
జడజనః = జడుడైన జనుడు, మందబుద్ధులైన జనులు
మహాదేవ+ఈశం = మహాదేవుడివైన, ఈశుడివైన, దేవతలకు శాసకుడివైన
త్వాం = నిన్ను
మనసి = మనస్సునందు
న మత్వా = భావించక,
శుక్తౌ = ముత్యపుచిప్ప యందు
రజతం = వెండి అనీ
కాచ+అశ్మని = గాజురాతి యందు
మణిః = మణి అనీ
పైష్టే = పిండి కలిపిన
జలే = నీటియందు
క్షీరం = పాలు అనీ
మృగతృష్ణాసు = ఎండమావులను
సలిలమ్ = నీరు అనీ
ఇతి = ఇటువంటి
బుద్ధిః = బుద్ధిని ( మిథ్యా బుద్ధి )
యథా = ఏ విధముగా
భవతి = కలుగుచున్నదో, కలిగి ఉన్నారో,
తథా = అదే విధముగా
భవత్ + అన్యం = నీ కంటే ఇతరులైన వారిని
దేవ = దేవతలు
భ్రాన్త్యా = అనే భ్రమతో
భజతి = సేవించుచున్నాడు, సేవించుచున్నారు.

పశువులైన సర్వజీవులను రక్షించే ఓ పశుపతీ ! దేవాధిదేవా ! మహాదేవా ! మంద బుద్ధులైన నరుల బుద్ధి సరిగ్గా పని చెయ్యదు కనుక ముత్యపు చిప్పను చూచి వెండియని, గాజుముక్కను మణియని, పిండి కలిపిన నీటిని పాలు అనీ, ఎండమావులను చూచి నీరు అనీ భ్రమ పడతారు.  అదేవిధముగా, మంద బుద్ధులైన జడమతులు, పరమాత్మవు, సర్వ శక్తిమంతుడవు, సర్వేప్సిత ప్రదాయకుడవు, మోక్షమునివ్వగల దేవదేవుడివైన నిన్ను తెలుసుకోలేక, స్వల్పమైన ఐహికాముష్మికమైన కామనలను తీర్చగల ఇతర దేవతలనే అధికులుగా భ్రమపడి ఆరాధిస్తూ ఉంటారు అని జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు చెప్తున్నారు.

జడమైన శరీరమే నేను అనే భ్రాంతి కలిగిన వారు జడమతులు. సర్వసాధారణంగా నేను అనగానే, మనము వ్యవహారం కోసం మనకు పెట్టబడిన పేరు కల మన ఈ దేహమే నేను అనుకుంటాము. మన ఇంద్రియాలే నేననీ, మనస్సే నేననీ, ప్రాణమే నేననీ, ఇవన్నీ కలిసి ఉన్న దేహమే నేను అనీ అనుకుంటాము. దీనినే దేహాత్మ భ్రాంతి అంటారు. దేహమే నేను అనే భ్రాంతి ! దీనినే చిత్జడగ్రంథి అన్నారు. అంటే చైతన్యాన్ని జడంతో ముడి పెట్టడం.  తాము సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ అనే సత్యమును తెలుసుకోలేక దేహ భ్రాంతికి లోనవుతున్నారు. 'నేను' అనటానికి ఏది ఆధారమో, దానిని భ్రమ వల్ల గుర్తించలేక పోతున్నారు. ఒకదానిని మరొకటిగా భావిస్తున్నారు. ఈ భ్రమ ఎందు వల్ల అంటే, అజ్ఞానం వలన, మాయ వలన ! మాయ అంటేనే మోహము, భ్రమ. మాయకు రెండు శక్తులున్నాయి. 1.ఆవరణ శక్తి. 2. విక్షేప శక్తి. ఆవరణము అంటే కప్పి పెట్టటము. ఆవరణ శక్తి ఉన్న సత్యాన్ని కనపడనీయకుండా కప్పేస్తుంది. విక్షేప శక్తి ఉన్నదాన్ని వేరే దానిలా కనిపించేలా చేస్తుంది. దీనినే రజ్జు సర్ప భ్రాంతి అనీ, శుక్తి రజత భ్రాంతి అనీ అనేక ఇతర ఉపమానాలతో చెప్తారు. ఉన్న పరబ్రహ్మ కనిపించదు. లేని విశ్వం గోచరిస్తూ ఉంటుంది. అనుభవంలో భాసిస్తూ, మోహపెడుతూ ఉంటుంది.

ఈ శ్లోకంలో ఆచార్యులు భ్రాంతి ఎలా ఉంటుందో ఉదాహరణలతో చూపించారు.
తళతళ లాడుతున్న ముత్యపు చిప్పలను చూసి వెండి అనుకోవటము,
గాజు రాళ్ళను మణి అనుకోవటము,
పిండి కలిపిన నీటిని పాలను కోవటము భ్రాంతి వల్ల, వస్తు యథార్ధ జ్ఞానము లేకపోవటం వల్ల కలిగేవి. ఈ ఉదాహరణలలో ఒక దానిపైన వేరే దానిని ఆరోపించటము జరిగింది. ముత్యపు చిప్ప మీద వెండి ఆరోపించ బడింది. అలాగే, గాజురాయి మీద రత్నము, తెల్లగా కనిపించే పిండి నీళ్ళ మీద పాలు ఆరోపించ బడ్డాయి. ఆ వస్తువులలో ఆరోపించ బడిన వస్తు లక్షణములు గోచరిస్తున్నాయి కనుక అలా ఆరోపించబడటానికి అవకాశం కుదిరింది. దీనిని అధ్యారోపము అంటాము.
అసలు నీరులేని చోట నీరుందను కోవటాన్ని  ఎండమావులు అంటాము. ఎండమావులను, గంధర్వనగరాన్ని, వంధ్యాపుత్రుని, కుందేటి కొమ్మును కూడా లేనిది ఉన్నదనుకోవటానికి ఉదాహరణలుగా చెప్తారు.
అలాగే అజ్ఞానం వలన
దేవాధిదేవుడవు, పరబ్రహ్మమునగు
నిన్ను మనస్సునందు భావన చేయక, నీకు భిన్నమైన ఇతర సామాన్య దైవములను భజించుచున్నారు మూఢమతులు అని జగద్గురువులు తెలియజేస్తున్నారు.

దేహమే నేను అనుకునే వారిని జడజనులు అంటున్నారు ఆచార్యులు!
మనిషిని చిత్ జడగ్రంధి అని అంటుంది ఉపనిషత్తు!
జడమే నేననుకునే వారు జడజనులు. చిచ్ఛక్తే పరమాత్మ. సర్వ జీవులలో ఉన్న చైతన్యమే పరమాత్మ. ఆయనే మహేశ్వరుడు, మహాదేవుడు.

తాను కాని దానిని తాననుకుని, నీవు కాని వాటిని నీవనుకొని భ్రమలో బతుకుతున్న జడజనులను వారు పశువులు కనుక, వారి రక్షణ భారం నీది కనుక, నీవే ఈశ్వరుడివి, సర్వశాసకుడివి కనుక పరమేశ్వరా ! నీవే కరుణించి,
వారిని మాయనుండి  రక్షించు ! నిన్ను గురించిన జ్ఞానాన్ని వారికి కలుగజెయ్యి. శాశ్వతానంద ప్రాప్తిని, శ్రేయస్సును అనుగ్రహించు అని ప్రార్ధిస్తున్నారు జగద్గురువులు ఈ శ్లోకంలో ! ప్రతి శ్లోకంలోను ఆ శ్లోకములో చేయబడిన ప్రార్ధనకు అనుగుణమైన సంబోధనతో మహేశ్వరుడిని ప్రార్ధిస్తున్నారు ఈ శివానంద లహరి శ్లోకాలలో !

దేవతలు అంటేనే తేజోమయ శరీరులు, మానవుల కంటే గొప్పవారు. వారికి నాయకుడు మహేంద్రుడు. మహేంద్రుని కంటే అధికులు త్రిమూర్తులు. వారి కంటే అధికుడు పరమాత్మ, పరబ్రహ్మ, ఉపనిషత్ప్రతిపాదిత సత్యమైన మహాదేవుడు. అటువంటి ముక్తినిచ్చే మహేశ్వరుని స్మరించకుండా, స్వల్పమైన కోరికలను తీర్చే దైవాలను కొలవటం ప్రచండ తేజంతో వెలుగొందుచున్న భాస్కరుడుండగా, వెలుగు కోసం గుడ్డి దీపాలను, బుడ్డి, లాంతర్లలాంటి దీపాలను ఆశ్రయించటం లాంటిది అని తెలుసుకోవాలి.

🙏🙏🙏🌹

డా.విశాలాక్షి.

శివానందలహరి శ్లోకం 7

ఓం నమశ్శివాయ
శివానందలహరి
శ్లోకం 7

మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రఫణితౌ
కరశ్చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణన విధౌ
తవధ్యానే బుద్ధిర్నయన యుగళం మూర్తి విభవే
పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః !! 7 !!
శ్లోకం
పదాన్వయము, ప్రతిపదార్ధ తాత్పర్యములు -

పరమశివ, మనః, తే, పాదాబ్జే, నివసతు, వచః, స్తోత్రఫణితౌ, చ, కరః, అభి+అర్చాయాం, శ్రుతిః అపి, కదా + ఆకర్ణన విధౌ, బుద్ధిః, తవ, ధ్యానే, నయన యుగళం, మూర్తి విభవే, నివసతు, అతః పరం, పరగ్రంథాన్, కైః వా, జానే.

పరమశివ = హే పరమేశ్వరా ! పరమ మంగళ స్వరూపా !
మనః = నా మనస్సు
తే పాదాబ్జే = నీ పాదారవిందములయందే
వచః = నా వాక్కు
స్తోత్ర ఫణితౌ = నిన్ను స్తుతించుటయందు,
చ = మరియు
కరః = కరములు
అభ్యర్చాయాం = నిన్ను పూజించుట యందు;
శ్రుతిః అపి = నా కర్ణములు కూడా
కథా ఆకర్ణన విధౌ = నీ కథలను వినుట యందు,
బుద్ధిః = నా బుద్ధి
తవ ధ్యానే = నీ ధ్యానము నందు
నయన యుగలం = నా నేత్ర ద్వయము
మూర్తి విభవే = నీ దివ్య మంగళ విగ్రహమును వీక్షించుటయందు,
నివసతు = నిలిచి ఉండు గాక !
కైః వా = ఏ విధముగా
అతః పరం = ఇంతకు మించి
పర గ్రంథాన్ = నీకు వ్యతిరిక్తమైన గ్రంథములను
కైః వా = ఏ ఇతర ఇంద్రియములతో
జానే = తెలుసుకొనగలను ?

ఓ పరమశివా ! నా మనస్సు నీ పాదారవిందములయందు వసించుగాక ! నా వాక్కు నిన్ను స్తుతించుటయందును, నా కరములు నిన్ను పూజించుటయందును, నా కర్ణములు నీ కథాశ్రవణమనెడి విధి యందును, నా బుద్ధి నీ ధ్యానమునందును, నా నేత్రద్వయము నీ దివ్య మంగళ విగ్రహమును వీక్షించుట యందును లగ్నమగుగాక ! అలా నా ఇంద్రియములు నీ యందే ఆసక్తమై ఉండగా ఇక ఇతర గ్రంధముల నుండి అంతకు మించి క్రొత్తగా తెలుసుకొనవలసినది ఏమి మిగిలి యుండును?

అత్యంత ఉదాత్తమైన మానవ ఉపాధి లభించినప్పుడు దానితో ఎలా తరించగలమో చెప్పిన మహోత్కృష్ట మంత్ర సదృశ శ్లోకమిది. బుద్ధిని శివ భక్తి యందు లగ్నము చేసి, తన మనస్సు, వాక్కు మొదలైన ఇంద్రియాలకు కూడా ఇతర విషయాలపై ఆసక్తి లేకుండా చేసి, పరమ శివుని సేవాసక్తిని కలిగించమని జగద్గురువులు ఈ శ్లోకంలో ప్రార్ధిస్తున్నారు.

పరమేశ్వరుడు అనుగ్రహించి ఇచ్చిన మనస్సును ఇంద్రియాలను పరమేశ్వరార్పణమెలా చెయ్యాలో తెలియపరచే శ్లోకమిది. మనకు కన్నులున్నందుకు, చెవులున్నందుకు, చేతులున్నందుకు, మనస్సున్నందుకు, ఈ శరీరమున్నందుకు ఏమి చేస్తే అవి సార్ధకత పొందుతాయో తెలియజేసే స్తోత్ర శ్లోకమిది. ఏ భక్తులైనా పరమేశ్వరుడిని ప్రార్ధించేది ఇదే ! కన్నులున్నందుకు నేను చూస్తే, నిన్నే చూడాలి, చెవులున్నందుకు నీ చరితలే వినాలి, నోరున్నందుకు నీ గుణగానమే చెయ్యాలి, నిన్నే భజించాలి. బుద్ధి ఉన్నందుకు నీ గురించే ఆలోచించాలి, మనస్సున్నందుకు దానిని నీకే అర్పించాలి.

చేతులారంగ శివుని పూజింపడేని,
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని,
దయయు సత్యంబు లోనుగా దలపడేని,
కలుగనేటికి తల్లుల కడుపు చేటు !

ఓ పరమేశ్వరా ! నా మనస్సు నీ పాదపద్మములందునూ , నా వాక్కు నీ స్తోత్రపాఠములు చదువుటయందునూ , నా చేతులు నీ పూజయందునూ, నా చెవులు నీ చరిత్రలను వినుటయందునూ, నా బుద్ధి నీ యొక్క ధ్యానమందునూ, నా యొక్క కన్నులు నీ దివ్యమంగళ విగ్రహం చూచుటయందునూ స్థిరపడియుండుగాక ! అలా నా మనస్సు, బుద్ధి ఇంద్రియాలు సమస్తమూ నీమీదే లగ్నమై నీ పనులే చేస్తుంటే, ఇంక నా ఇంద్రియములు నీ స్పర్శ లేని వేరు విషయములు తెలిసికొనుటకు ఎలా పని చేస్తాయి? ఇంక వాటికి ఇతర గ్రంథాలను చూడవలసిన పనే ఉండదు. వాటికి నీయందే రమించే తత్త్వమేర్పడినప్పుడు ఇంక ఏ బాహ్య విషయాల మీదకు ప్రసరించటానికీ ఇష్టపడవు. కావున ఓ మహేశ్వరా ! నా మనస్సు నీమీదే లగ్నమయేలా, నా బుద్ధి నిన్నే ధ్యానించేలా, నా చేతులు నిన్నే అర్చించేలా, నా చెవులు నీ కథా శ్రవణమే వినేలా, నా నోరు నిన్నే స్తోత్రించేలా, నా పాదాలు నీకే ప్రదక్షిణ చేసేలా అనుగ్రహింపుము అని ప్రార్ధించాలి. అప్పుడు ఇంద్రియాలు పెడదారి త్రొక్కవు.
ఈ యోగాన్నే భక్త ప్రహ్లాదుడు పసి ప్రాయంలోనే అలవరచుకుని, ఐదేళ్ళ ప్రాయంలో తన తండ్రికి బోధించాడు.

కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
దేవదేవుని చింతించు దినము దినము
చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు
కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు
తండ్రి హరిజేరుమనియెడి తండ్రి తండ్రి !!
ఈ పద్యం తెలియని తెలుగువారుండరు. చదివి, విని మైమరచిపోనివారుండరు. మనకు పంచేంద్రియాలను ఇచ్చినందుకు కృతజ్ఞతగా పంచోపచార పూజ చెయ్యాలని చెప్తారు. అది కృతజ్ఞతా ప్రకటన !

పర గ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః - అంటే - మన సకలేంద్రియాలు, సర్వమూ ఈశ్వరుని యందే లగ్నమై ఉంటే, తాను ఇంక ఏ ఇతర ఇంద్రియములతో ఏ ఇతర గ్రంథాలను తెలుసుకుంటాడు ? దానికి అవకాశమే లేదని చెప్తున్నారు జగద్గురువులు.

పరమాత్మ యొక్క విరాట్స్వరూపంలో ఈ చతుర్దశ భువనాలూ నాలుగవ వంతు మాత్రమే ! మిగతా మూడు వంతులూ మనకు అగమ్య గోచరములు. కనిపించే ఈ నాలుగవ వంతులోనే మనకు తెలిసినది అత్యల్పం. అటువంటి పరమాత్మను ఎలా తెలుసుకోగలము ?

"పాదో2స్య విశ్వా భూతాని, త్రిపాదస్యామృతం దివి
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః ..."
మరి అటువంటి విరాట్పురుషుని అల్ప శక్తిమంతమైన ఇంద్రియాలతో మనం ఎలా పట్టుకో గలము ? మనం ఎలా తరించాలి,  అంటే, మనం సృష్టిని, ప్రపంచాన్ని ఎలా చూడాలో తెలుసుకోవాలని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ ప్రపంచంలో వేరు వేరు నామ రూపాలతో కనిపించే సమస్తమూ పరమాత్మ ప్రకటనమేనని గ్రహించాలి. జగత్తును జగత్తుగా చూడకుండా, జగత్తును పరమాత్మ అభివ్యక్తిగా చూడాలి. జగత్తంతా వ్యాపించిన  పరమాత్మను దర్శించాలి అని చెప్తున్నారు.

🙏🙏🙏🌹🌹
డా.టి.(ఎస్)విశాలాక్షి

శివానందలహరి శ్లోకం 6

ఓం నమశ్శివాయ
శివానందలహరి
శ్లోకం 6

ఘటో వా మృత్పిండోప్యణురపి చ ధూమోగ్నిరచలః
పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్ !
వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః  !! 6 !!
శ్లోకం
పదాన్వయము, అర్ధతాత్పర్యములు -

సుధీః, ఘటః, వా, మృత్పిండః, అపి, చ, ధూమః, అగ్నిః, అచలః,  పటః, వా, తంతుః, వా, ఘోరశమనమ్, పరిహరతి కిం, వృధా, కంఠక్షోభః, వహసి, తరసా, తర్క వచసా, శంభోః, పదాంభోజమ్, భజ, పరమ సౌఖ్యం, వ్రజ.

సుధీః = ఓ మంచి బుధ్ధి కలవాడా !
ఘటః = కుండ కానీ,
వా = లేదా
మృత్ పిండః అపి =  మట్టి ముద్ద అయినా,
అణుః అపి = లేక (కేవలము) పరమాణువులు అయినా
చ = మరియు
ధూమః = పొగ కానీ
అగ్నిః = అగ్ని కానీ
అచలః = పర్వతము కానీ,
(అగ్ని కనిపించుచున్నది కావున, బహుశా పర్వతముపై నిప్పు ఉండవలెను (మొ.న హేతువాదములూ)
పటః = వస్త్రము కానీ,
వా = లేక
తన్తుః వా = లేక దారములా (ఇత్యాది తర్కములు)
ఘోరశమనం = ఘోరమగు మృత్యువును (యముడిని)
పరిహరతి కిం ? = తొలగించ గలవా?
తరసా తర్కవచసా = తీవ్రమైన తర్క వాదములతో
వృథా = వ్యర్ధముగా
కంఠ క్షోభం = కంఠశోషను
వహసి = పొందుచున్నావు.
శంభోః = శంభుని యొక్క
పదాంభోజం = పాద పద్మములను
భజ = భజింపుము,
పరమసౌఖ్యం = (తద్వారా) పరమ సౌఖ్యములను
వ్రజ = పొందుము.

కుండగానీ, మట్టి ముద్దగానీ , పరమాణువు గానీ, పొగగానీ, నిప్పుగానీ, పర్వతముగానీ , వస్త్రము గానీ , దారము గానీ ఇవేమీ భయంకరమయిన మృత్యువు నుండీ కాపాడలేవు. అందుకే ఓ మంచిబుద్ధి కలవాడా ! పైన చెప్పిన తర్కశాస్త్రమునందలి మాటలతో వృథాగా కంఠక్షోభ కలిగించు కొనక, శంభుని యొక్క పాదపద్మములను సేవించి, శీఘ్రముగా శివ సాయుజ్యమును పొందుము.
తర్కాది శాస్త పరిజ్ఞానము చిత్తశుధ్ధికీ, ఆత్మజ్ఞానమునకూ దోహదపడాలి. అంతే కాని కేవల శాస్త్రపరిజ్ఞానము వ్యర్థమని శంకరాచార్యుల ఉపదేశం.

సాంఖ్యులు, నయ్యాయికులు, వైశేషికులు మొదలగు వారు చేసే శాస్త్ర చర్చల వల్ల జీవిత పరమ ప్రయోజనం సిద్ధించదని జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు. "కనబడుచున్న ఆ వస్తువు కుండయా? లేక మట్టియా? లేక అణువులా?" వంటి హేతువాదములు, "దూరముగా ఆ కొండపై పొగ కనిపించున్నది కాబట్టి అక్కడ నిప్పు ఉండి తీరవలెను" వంటి తర్క వాదములు, "దీనిని వస్త్రముగా చూడవలెనా? లేక దారముల సమూహముగా చూడవలెనా?" వంటి శుష్క వాదములను తీవ్ర స్థాయిలో చేయుట వలన కేవలము వ్యర్ధముగా కంఠశోష తప్ప ఎంతమాత్రము ప్రయోజనము లేదు. అట్టి అనవసర వాదములు మనలను ఘోరమగు మరణము నుండి ఏమైనా రక్షించగలవా? అందువల్ల, ఓ బుధ్ధిమంతుడా ! వాటి బదులు పరమశివుని పాద పద్మములను పూజించుచూ పరమ సౌఖ్యములను పొందుము అని చెప్తున్నారు.

ధూర్జటి తన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యములో

"ఏ వేదంబు పఠించె లూత? భుజగం బే శాస్త్రముల్సూచెఁ దా
నే విద్యాభ్యసనం బొనర్చెఁగరి, చెంచే మంత్ర మూహించె ? బో
ధావిర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు, నీ పాదసం
సేవాసక్తియె కాక జంతు తతికిన్ శ్రీ కాళహస్తీశ్వరా"! అన్నారు.

ప్రాణికోటికి మోక్షము కలుగుటకు నీ పాదాలు సేవించు భక్తి ఒక్కటే కారణం గానీ, చదువులెన్ని చదివినా, అనుభవ జ్ఞానమును, మోక్షమును కలిగిస్తాయా ?

నీ దయతో మోక్షము పొందిన సాలెపురుగు ఏ వేదము చదివింది? పాము ఏ శాస్త్రములు పఠించినది? ఏనుగు ఏ విద్యలు నేర్చుకున్నది? ఎరుకలవాడు ఏ మంత్రజపము చేశాడు. వీరందరూ ముక్తి పొందటానికి చదువులే కారణమైనవా? కాదు కదా ! కేవలము భక్తి చేత ఈశ్వరానుగ్రహం పొంది తరించారు వీరందరూ.

అందుకే శంకరాచార్యులు 'భజ గోవిందం భజ గోవిందం
భజ గోవిందం మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృంకరుణే' అని ఉద్బోధ చేశారు.

భజ గోవిందం భజ గోవిందం అని గోవిందుణ్ని భజించు మూఢమతీ ! జీవితమంతా వల్లె వేసిన ఈ డుకృంకరుణే అనే వ్యాకరణ సూత్రాలు నిన్ను అవసాన కాలంలో రక్షించవు అని చెప్పారు.

లౌకిక విద్యలు ప్రపంచంలో అందరికీ అవసరమే. ఈ విద్యల వలన మనలో విజ్ఞానం, వినయం, లోకజ్ఞానం, కలుగుతాయి. అయితే ఈ విద్యలు ప్రపంచంలో జీవించటానికే తప్ప, జీవిత పరమ గమ్యాన్ని చేరటానికి ఉపయోగప డవు. మృత్యువును ఈ విద్యలు తప్పించలేవు. ఉదర పోషణే ప్రధానం అని జీవించే మానవుడు ఎన్నటికీ పరమపదాన్ని చేరు కోలేడు. అజ్ఞానమనే మాయపొర జ్ఞానమనే వెలుగును కప్పి ఉంచుతుంది. ఆ మాయను తొలగిస్తేనే గాని జ్ఞానము యొక్క అసలు తేజం తెలియదు. మనలో ఉన్న మాయను తొలగించడం అంత తేలికైన పనికాదు. దానికి ఆధ్యాత్మిక పరమైన విద్య చాలా అవసరం. ' అధ్యాత్మ విద్యా విద్యానాం' అంటోంది శ్రుతి. వేదోపనిషత్తులలో ఉన్న విషయాలు, అష్టాదశ పురాణాలలో ఉన్న విషయాలు లోతుగా అధ్యయనం చేయాలి. ప్రతి ఒక్కరికి భక్తి ఉండాలి. ఆ భక్తి వలన అధ్యాత్మపరమైన జ్ఞాన సంపద వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక చింతలో ఉన్న వారికి ఏదో ఒక సమయంలో వైరాగ్యం కలుగు తుంది. అంతిమ దశలో మనల్ని రక్షించేది ఆధ్యాత్మిక భావనలే. ఈ సంసార సాగరం నుంచి తరింపజేసేది కేవలం భగవన్నామ స్మరణమే. అందుకే ప్రాణం పోయే ముందు మనిషికి చెవిలో ‘నారాయణ, నారాయణ’ అనే నామాన్ని వినిపిస్తారు. ఈ నగ్న సత్యం తెలిసి కూడా హరి నామాన్ని కీర్తించనివారు మూఢాత్ములే ! ప్రతి ఒక్కరూ, ప్రతి క్షణం భగవన్నామ స్మరణతో నిండు జీవితాన్ని పునీతం చేసుకోవాలి.

🙏🙏🙏🌹🌹
డా.టి.(ఎస్)విశాలాక్షి

శివానందలహరి. శ్లోకం - 5

ఓం నమశ్శివాయ
శివానందలహరి.
శ్లోకం - 5

స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ
పురాణే మంత్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః !
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కో2హం పశుపతే !
పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో !!
శ్లోకం
పదాన్వయమ, అర్ధములు, భావము, వివరణ -

పశుపతే, సర్వజ్ఞ, విభో, స్మృతౌ, శాస్త్రే, వైద్యే, శకునకవితాగానఫణితౌ, వా, మన్త్రే, స్తుతి, నటన, హాస్యేషు, అచతురః, మయి, రాజ్ఞాం, ప్రీతిః, కథం, భవతి?, అహం కః, ప్రథిత కృపయా, మాం, పాలయ.

పశుపతే = ఓ పశుపతీ ! సర్వ జీవులకు ప్రభువైనవాడా !
సర్వజ్ఞ = సర్వం జానాతి ఇతి సర్వజ్ఞః, సర్వము తెలిసినటువంటివాడా !
విభో = హే ప్రభూ !
స్మృతౌ = స్మ్రుతులయందు (పరాశర స్మృతి, మనుస్మ్రుతి మొ.గు)
శాస్త్రే = శాస్త్రములయందు
వైద్యే = వైద్యమునందు
శకున = శకున శాస్త్రము నందు
కవితా = కవిత్వము నందు
గాన = సంగీతము నందు
ఫణితౌ = సభలో వాగ్వాదములు చేసే శక్తి యందు కానీ
పురాణే = పురాణములయందు
వా = లేక
మన్త్రే = (వేద) మంత్రములయందు
స్తుతి = స్తుతించుటయందు
నటన = నటనయందు
హాస్యేషు =  హాస్యమునందు
అచతురః = చతురత, నిపుణత లేనివాడను. మయి = నాయందు
కథం = ఏవిధముగా
రాజ్ఞాం ప్రీతిః = రాజుల యొక్క ఆదరము
భవతి = కలుగుతుంది ?
కః అహం = నేను ఎవరు?
పశుం మాం = కేవలము అవివేకియైన పశువునైన నన్ను
ప్రథిత = వేదములలో కీర్తించబడి, ప్రసిద్ధుడివైన ఈశ్వరా ! నీ ప్రసిద్ధి గాంచిన
కృపయా = కృపతో
(నన్ను)
పాలయ = పాలించుము.

నేను స్మృతులయందు, శాస్త్రములయందు, వైద్యమునందు, శకున శాస్త్రమునందు, కవిత్వ, సంగీత, వ్యాకరణములయందు, పురాణములయందు, వేద మంత్రములయందు, స్తుతి చేయుటయందు, నటన హాస్యాదులలో ఎందులోనూ కూడా ఎటువంటి చాతుర్యము లేనివాడను. అట్టి నాయందు ప్రభువులైన రాజులకు ఆదరము ఏవిధముగా కలుగుతుంది? ఓ పశుపతీ, అసలు నేను ఎవరిని వారి ప్రేమను పొందటానికి ? నేను కేవలము అవివేకినైన పశువును. అయినప్పటికీ, ఓ సర్వజ్ఞమూర్తీ, నీ అపారమగు కృపతో నన్ను రక్షించుము.

సర్వజ్ఞుడవైన హే ఈశ్వరా ! శ్రుతి, స్మృతి,  పురాణేతిహాసముల చేత తెలియబడే ప్రభో !
మను స్మృతి, పరాశర స్మృతి, నారద స్మృతులవంటి
స్మృతులయందు గానీ, తర్క, వ్యాకరణ, మీమాంసాది శాస్త్రములయందు గానీ, ధర్మశాస్త్రములందు గానీ, ఆయుర్వేదము వంటి వైద్యమునందు గానీ, శకునములు చెప్పుటయందు గానీ, కవిత్వము చెప్పి మెప్పించుటయందు గానీ, సంగీతము పాడి రంజింపజేయుట యందు గానీ, పురాణ ప్రవచనములు చెప్పుట యందు గానీ,  మంత్రశాస్త్ర మందు గానీ, ఎవరిని గురించి స్తోత్రములు చేయుట యందు గానీ, నాట్యము చేయుటయందు గానీ, హాస్యోక్తులు చెప్పి నవ్వించుట యందు గానీ ఏమాత్రమూ నేర్పు లేనివాడను. ఇట్టి నాయందు రాజులకు ప్రేమ ఎందుకు కలుగుతుంది ? ఒకవేళ వారికి నా యందు ప్రీతి కలిగి ఆదరించినా, వారిని సంతోష పెట్టడానికి నేనెవరిని ? నాకు వారిచ్చేటటువంటి అధికారములు కానీ, బహుమతులు మొదలగు ఫలములు ఏవీ వద్దు. హే పశుపతే ! నే నెవ్వరినో నాకే తెలియని అజ్ఞానిని, పశువును అయిన నన్ను పశుపతివైన నీవు అత్యంత దయతో రక్షించుము అంటూ జగద్గురువులు ఈశ్వరుని ప్రార్థిస్తున్నారు. శ్రీ ఆది శంకరాచార్యుల వారు సాక్షాత్తుగా ఈశ్వరుడే అయి ఉండీ, తాము సర్వజ్ఞులై ఉండి కూడా మానవ దేహంతో భూమి మీద సంచరిస్తున్నందు వలన మానవులెప్పుడూ అల్పజ్ఞులే, పరమాత్మే సర్వజ్ఞుడని చెప్పటానికీ, భగవంతునికి అహంకారం కలవారంటే వచ్చదు, దీనులంటే ప్రియము కనుక ఈ శ్లోకంలో తనకేమీ తెలీదని దీనత్వాన్ని తెలియజేస్తున్నారు. నారద భక్తి సూత్రాలలో ' ఈశ్వరస్యాప్యభిమాన ద్వేషిత్వాత్, దైన్య ప్రియత్వాత్ ' అని ఉంది.
జగద్గురువులు తమ 'దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం' లో -
"న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతి మహో
న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథాః !
న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం
పరం జానే మాతః త్వదనుసరణం క్లేశ హరణమ్ !! అని శలవిచ్చారు.
పరమాత్మ పశువులను పాలించేవాడు పశుపాలకుడు. నేను పశువును, నీవు పశుపతివి. కనుక నన్ను కాపాడటం నీ బాధ్యత అని చెప్తున్నారు ఈ శ్లోకంలో ! జీవులందరూ పశువులే ! కాలపాశ బద్ధులైన వారందరూ పశువులే ! అజ్ఞానముతో, అవిద్యతో బంధించబడిన వారందరూ పశువులే ! కాలాతీతుడైన, ఏ పాశము చేత బంధింపబడని పరమాత్మే పశుపతి.

జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు అత్యంత కరుణామయులు. కనుకే మనవంటి వారికి భగవత్ప్రార్ధన ఎలా చెయ్యాలో ఈ శ్లోకం ద్వారా తెలియపరిచారు.

ఈ శ్లోకంలో 'కథం మయి రాజ్ఞాం ప్రీతిర్భవతి ?  కో2హం ?' అని రెండు ప్రశ్నలు వేశారు. రాజుకి, అధికారులకు నా మీద ప్రీతి ఎలా కలుగుతుంది ? అసలు నేనెవరిని ? అని !!
మనం మనకేం కావాలన్నా, మనకంటే గొప్ప వాళ్ళను ఆశ్రయిస్తాము. వాళ్ళు వాళ్ళ కోర్కెలు తీర్చుకోవటానికి వాళ్ళ కంటే గొప్ప వారినాశ్రయిస్తారు. అది ఒక గొలుసులాంటిది. స్వల్పమైన చిన్న చిన్న కోర్కెలను తీర్చగలిగే, మన కంటే గొప్పవారైన అల్పశక్తిమంతుల్ని ఆశ్రయించటం కంటే, సర్వ శక్తిమంతుడైన పరమేశ్వరుడినే ఆశ్రయిస్తే, ఇంక లోటే ఉండదు కదా !
ధూర్జటి మహాకవి తన శ్రీకాళహస్తీశ్వర శతకంలో రాజులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండరు. ఇష్టం వస్తే అందలమెక్కిస్తారు, కోపం వస్తే, శిక్షిస్తారు. వారి సంపదలు క్షణికాలు. అలాంటి వారిని ఆశ్రయించరాదని నిర్ణయించి చెప్పారు.

" రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చునం
భోజాక్షీ చతురంత యాన తురగీ భూషాదులాత్మవ్యథా
బీజంబుల్, తదపేక్ష చాలు, బరితృప్తిం బొందితిన్, జ్ఞానల
క్ష్మీ జాగ్రత్ప రిణామమిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా" !!

శిక్షా, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, మరియు కల్పము అనే ఆరు వేదాంగాలు, న్యాయ వైశేషిక, సాంఖ్య యోగ, మీమాంస వేదాంతమనే షడ్దర్శనాలు, ఇవి గాక ధర్మశాస్త్రాలు, అన్ని కూడా శాస్త్రాలే ! ఇంకా అష్టాదశ పురాణాలున్నాయి. అనేక మంత్ర తంత్ర శాస్త్ర గ్రంథాలున్నాయి. ఇటువంటి వేటిలోనూ తనకు నైపుణ్యం లేదని ఆచార్యులు చెప్తున్నారంటే, అది జీవుడైన తాను ఎప్పుడూ అల్పజ్ఞుడేనని ప్రతి ఒక్కరూ గుర్తించాలనే !
గోపాలకుని బాధ్యత గోవుల రక్షణ. పశుపతి బాధ్యత పశువుల రక్షణ. కనుక నా రక్షణ బాధ్యత నీదే నని చెప్పి సర్వ సమర్పణ చెయ్యటాన్ని ఇక్కడ చెప్పారు. చిన్నపిల్లలు తమను అమ్మనాన్నలు రక్షిస్తారని ఎంత ధైర్యంగా ఉంటారో, మనం కూడా పరమేశ్వరుడే మనను రక్షిస్తాడని దృఢంగా నమ్మితే నిబ్బరంగా ఉండగలుగుతాము. మనం రక్షణ కోరవలసినది సర్వ సమర్ధుడైన పరమేశ్వరుడినే !

"రక్షకులు లేని వారల
రక్షించెద నంచు చక్రి రాజయ్యుండన్
రక్షింపుమనుచు ఒక నరు
అక్షము ప్రార్ధింపనేల ఆత్మజ్ఞునకున్" !!

పశువు, పాశము పశుపతి  - పదాల విశిష్టతను వివరించు కుందాము.

" పాశ బద్ధః పశుః " అన్నారు. కాల పాశము  చేత, కర్మపాశము చేత బద్ధులైనవారు పశువులు. కాలపాశము, కర్మ పాశము ఎవరి వశంలో  ఉంటాయో వారు పశుపతి.
" పశూన్ పాతి రమతే పునః తేషామధివసతి పాతి ఇతి పశుపతిః " - పశువులను సృష్టించి, వారితో ఆడుకుంటాడు, ఆనందిస్తాడు, వారి యందు నివసిస్తాడు, వారిని రక్షిస్తాడు కనుక మహేశ్వరుడు పశుపతి.
"సర్వథా యః పశూన్ పాతి ఇతి పశుపతిః" అన్ని విధాలుగా పశువులను కాపాడేవాడు పశుపతి. ' పశుపాశ విమోచనుడు ' అని ఈశ్వరుడినీ, 'పశుపాశ విమోచనీ ' అని అమ్మవారిని అంటాము.

" ప్రథమోహ్యేష దేవానాం, తం దేవానాం పరమం చ దైవతమ్ " అనేది వేద ప్రమాణం కనుక దేవదేవుడు మహాదేవుడు శివుడు. ఆ శివుని సహస్ర నామాలలో "పశుపతి " నామం ఒకటి. ఈ పేరుతో ఉన్న 'పశుపతినాథ్ ఆలయం' నేపాల్ లో ఉన్నది. దైవ నామాలలో కొన్ని దైవ మహత్వాన్ని, విభుత్వాన్ని చూపించేవి అవుతాయి. కొన్ని నామాలు దైవము చేసిన పనుల వల్ల, అనగా చూపించిన లీలల వల్ల ఆ పేర్లు వస్తాయి. శంభుః, శివః మొదలైనవి పరమేశ్వరుని విభుత్వాన్ని తెలియజేసే నామాలు. ఈశ్వరుడు చేసిన త్రిపురాసుర సంహార కార్యం - లీల వలన త్రిపురాంతకుడు, త్రిపురహరుడనే నామం వచ్చింది. పశుపతి నామం ఈశ్వరుని మహత్వాన్ని తెలియజేస్తోంది.

జీవులమందరమూ కాల పాశానికి బద్ధులము, కర్మ పాశానికి బద్ధులము. అజ్ఞాన పాశానికి, మోహపాశానికి బద్ధులము.  కాల బద్ధులైన, కర్మ బద్ధులైన  వారందరూ పశువులే ! ఎవరు ప్రకృతికి అధీనులై ఉంటారో వారు పశువులు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం అందరూ కాల బద్ధులు. ఎవరి ఆయుః ప్రమాణం తీరగానే వారు వెళ్ళి పోవలసిందే ! పశువులు పాశము ప్రకృతి ఎవరి అధీనంలో ఉంటుందో, ఆయన పశుపతి. కాలబద్ధులైన జీవులను వారి ఆయుః ప్రమాణం తీరగానే కాలపాశం వేసి, ఆ జీవుడిని లాగి  యమధర్మరాజు తీసుకుని వెళ్ళి పోతాడు. అటువంటి యముని పాశాన్ని కూడా నిగ్రహించగలిగిన పశుపతి పరమేశ్వరుడు. నిగ్రహానుగ్రహ సమర్ధుడు.
అనన్య భక్తితో తనను ఆశ్రయించిన భక్త మార్కండేయుని ప్రాణాలను తియ్యటానికి పాశం వేసిన యముని కాలపాశాన్ని నిగ్రహించిన కాలకాలుడు పశుపతి. పశుపతి దగ్గర ఉన్న అస్త్రము పాశుపతాస్త్రము.
పశువు, పాశము, పశుపతి - ఈ మూడు పదాల అర్ధము తెలుసుకోవటమే నిజమైన జ్ఞానము. ఈ మూడింటి జ్ఞానము ఎవరికి ఉంటుందో వారు కాలపాశం నుంచి విముక్తులవుతారు.  పాశము అంటే పశువులను బంధించే తాడు. పశుపతి యొక్క జ్ఞానమును పాశుపతము అంటారు. ఎవరు పశుపతి జ్ఞానం కలిగి ఉంటారో, అంటే పాశుపతమును ఆరాధిస్తారో, వారిని పశుపతి పశుపాశ బంధం నుంచి విముక్తులను చేస్తాడు. పాశంలో  తగుల్కొన్నవాడు జీవుడు. ఏ జీవుడు పాశ విముక్తుడవుతాడో, అతడు శివుడవుతాడు. అంటే, పశుపతి అనుగ్రహంతో పశుపాశం నుంచి విడుదల పొందిన జీవుడు పరమేశ్వరునిలో ఐక్యమవుతాడు. తానే శివుడవుతాడు. జీవుల కర్మల ననుసరించి వారికి ఉపాధులు లభిస్తాయి. ఉపాధులతో కర్మలు చేస్తారు. కర్మ ఫలాల ననుభవిస్తుంటారు.
'పశుం మాం పాలయ ప్రభో ' అని ప్రార్ధించాలి. ఆయన పశుపతి కనుక, సర్వజ్ఞుడు, సర్వ శక్తిమంతుడు కనుక మనలను పాలించ గలడు. లౌకికమైన పశు పాలకులు పశువులను కాస్తారు, రక్షిస్తారు, ఆవసరాలు తీరుస్తారు కానీ, జీవికి కావలసినవన్నీ ఇవ్వలేరు. పశుపతి అయిన పరమాత్మ రక్షించటము, అవసరాలు తీర్చటమే కాదు, అనాది అవిద్యను నశింపజేసి, నిశ్శ్రేయస్సును కూడా అనుగ్రహించ గలడు.

అర్జునుడు పాశుపతాస్త్రము పొందటం కోసం ఈశ్వరుడిని గురించి తపస్సు చేయగా, ఈశ్వరుడు కిరాత రూపంలో వచ్చి, అర్జునునితో ద్వంద్వ యుద్ధం చేసి, అతని పరాక్రమాన్ని పరీక్షించి, పాశుపతాస్త్రాన్ని ఉపదేశించాడు. ' 'పాశుపతాస్త్రోపదేశముం జేసెద పరుల గెల్వుము ప్రతాపంబు మీర ...' అని అనుగ్రహించాడు.
అర్జునుడు పాశుపతాస్త్రమును సంపాదించుకున్నాడే కానీ కురుక్షేత్ర యుద్ధంలో దాన్ని ప్రయోగించలేదు. జగన్మాత మటుకు భండాసురాది రాక్షస సంహార సమయంలో మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించి, రాక్షస సంహారం చేసింది.
' మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా.'

శ్రీకృష్ణ పరబ్రహ్మ మహేశ్వరుని తత్త్వాన్ని గురించి తెలుసుకోవటానికి, ఈశ్వర మంత్రోపదేశం పొందటానికి వెతుక్కుంటూ హిమాలయాలలో ఉన్న ఉపమన్యు మహర్షి ఆశ్రమానికి వెళ్ళి, ఆయన దగ్గరి నుంచి సంపూర్ణ శివతత్త్వాన్ని గ్రహించి, పశు, పాశ, పతి గురించి విస్తారంగా తెలుసుకున్నాడు. అనన్య అచంచల అఖండ అవ్యభిచారిణీ నైష్ఠికీ భక్తి కలిగిన ఉపమన్యువును శివపార్వతులు తమ కుమారునిగా ఆదరించి అనుగ్రహించారు. అటువంటి భక్తి, నిష్ఠ మనలో ఉంటే, మనం కూడా ఈశ్వరుని సంపూర్ణ కటాక్షాన్ని పొందగలము.

మనమే పరమాత్మ స్వరూపులమైనా, మన శరీరమంతటా పరమాత్మ చైతన్యమే ప్రసరిస్తూ ఉన్నా, మన హృదయంలోనే పరమాత్మ కొలువై ఉన్నా, మనకు ఆ పరమాత్మ ఉనికిని గ్రహించగల జ్ఞానం కలిగే దాకా శాస్త్రోక్త విధానంలో సాధన చెయ్యాలి. ఆ సాధన జపము, తపము, అర్చన, హోమము, శ్రవణము, కీర్తనము, మననము లాంటి అనేక పద్ధతులలో ఏ పద్ధతిలోనైనా కావచ్చును. అన్నీ కూడా కావచ్చును. ప్రాణాయామము చేస్తూ, శ్వాసతో మంత్ర నామాన్ని, దైవ నామాన్ని అనుసంధానం చెయ్యవచ్చును.
మనం ఉచ్ఛ్వాసతో - అంటే గాలి పీల్చేటప్పుడు పరమేశ్వరుని స్మరిస్తూ "నీవు పశుపతివి" అనీ, నిశ్శ్వాసలో - అంటే గాలి వదిలి పెట్టేటప్పుడు " నేను పశువును" అని అంటూ  చెయ్యటం వలన అది పశుపాశవిమోచనను కలిగించే మహాశక్తిమంతమైన మంత్రంలా మారి మనలను ఉద్ధరిస్తుంది. మనం గాలి పీల్చేటప్పుడు "నీవు పశుపతివి, నిన్ను నాలోనికి తీసుకుంటున్నాను" అంటూ, విశ్వమంతా నిండి ఉన్న వాయుస్వరూపుడైన ఈశ్వర శక్తిని పశుపతిగా భావన చేస్తూ లోపలికి తీసుకుంటున్నాము. అప్పుడు విశ్వాత్ముడైన పరమేశ్వర శక్తి మనలో ప్రవేశించి, మన శరీరములోని ప్రతి అణువు శివశక్తి భరితమవుతుంది. మనం గాలి వదిలేటప్పుడు, మన నిశ్శ్వాసతో మనలో ఉన్న పశుతత్త్వమును "నేను పశువును, పశుత్త్వాన్ని వదిలేస్తున్నాను" అని భావిస్తూ బైటికి వదిలేస్తే, క్రమక్రమంగా మనలోని పశులక్షణాలైన అజ్ఞానము, తంద్రత, సోమరితనము, కామక్రోధాది దుర్గుణాలు అన్నీ నెమ్మది నెమ్మదిగా మనలోనుంచి బైటకు వెళ్ళిపోతాయి. ఈ విధమైన సాధన వలన పశువు యొక్క పాశాలు తెగిపోయి, పశువు పశుపతిగా మారిపోతుంది. అదే " అహం బ్రహ్మా2స్మి" అనుభవం.

🙏🙏🙏🌹🌹

డా.టి.(ఎస్) విశాలాక్షి